తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.

తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలోనే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ జలాశయాలను గేట్లను ఎత్తారు. హిమాయత్‌సాగర్‌ రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్‌సాగర్‌ నుంచి 1,373 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతుంది. 

ఇక, ఉస్మాన్‌సాగర్ రెండు గేట్లను ఎత్తి 442 క్యూసెక్కుల నీటిని అధికారులు మూసీలోకి విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ నదిలో నీటిమట్టం పెరగనుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నీటి విడుదల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సూచించారు. 

ఇక, గత రాత్రి నుంచి హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలుచోట్ల రోడ్లపై వర్షపునీరు చేరడంతో చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ఆ మార్గాల్లో వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మేడ్చల్, రంగారెడ్డి, హైద్రాబాద్ జిల్లాలోని స్కూళ్లకు ఈరోజు సెలవు ప్రకటించారు. మూసీ పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సూచించారు.