సూర్యాపేట: హుజూర్ నగర్ ఉపఎన్నిక ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసి గెలుపొందారని ఆమె ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున తమకు మద్దతు ప్రకటించారని చెప్పుకొచ్చారు. 

మెుదటి రౌండ్లోనే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డికి 2వేల ఓట్లు ఆధిక్యం అనగానే తనకు సందేహం వచ్చిందన్నారు ఉత్తమ్ పద్మావతి. నియోజకవర్గంలో తాము ఎన్నో అభివృద్ధి పనులు చేశామని ప్రజలు తమను కోరుకున్నారని తెలిపారు. 

అదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని అయినప్పటికీ ఎలా గెలిచిందో అన్న సందేహం కలుగుతుందన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రజలు ఇవ్వలేదని ఈవీఎం మిషన్ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. 

ఈవీఎంలలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఉత్తమ్ పద్మావతి స్పష్టం చేశారు. చాలా మంది స్వతంత్ర అభ్యర్థులు తన దగ్గరకు వచ్చారని తమ కుటుంబ సభ్యులు కూడా వేసిన ఓట్లు వేరొకరికి వెళ్తున్నాయని తనతో చెప్పారని ఆమె ఆరోపించారు. 

ఉప ఎన్నికల్లో ఓటమి బాధ కలిగించిందంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. హుజూర్‌నగర్ ఓటు, నియంతృత్వ కేసీఆర్ పాలనకు ప్రశ్నగా మారుతుందనుకున్నామని భావించినట్లు తెలిపారు. 

ఈ ఉపఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ నియంతృత్వ పాలన అంతం కావాలని అందరూ అనుకున్నారని చెప్పారు. యావత్‌ తెలంగాణ ప్రజల మనోభావాలను మోసుకుంటూ అభ్యర్థిగా తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని చెప్పుకొచ్చారు.  

ఎన్నికల ప్రచారంలో ప్రజలు తమకు బ్రహ్మరథం పట్టారని స్పష్టం చేశారు. అనేకమంది తమకు మద్దతు ప్రకటించిన విషయాన్ని పదేపదే చెప్పుకొచ్చారు. అయితే ఈ ఫలితం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. ఈవీఎంలను మేనేజ్ చేసి గెలుపొందారని ఉత్తమ్ పద్మావతి ఆరోపించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

Huzurnagar Bypoll Result 2019: ఒకే ఒక్క పోలింగ్‌ బూత్‌లో పద్మావతికి మెజారిటీ

ఉత్తమ్‌కు సై, పద్మావతికి నై, అదే సైదిరెడ్డి విజయం :హుజూర్‌నగర్ ఓటింగ్ సరళి ఇదీ