హైదరాబాద్ అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత నగరవాసుల్లో వీధి కుక్కల దాడులపై తీవ్ర భయాందోళన నెలకొంది.
హైదరాబాద్ అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత నగరవాసుల్లో వీధి కుక్కల దాడులపై తీవ్ర భయాందోళన నెలకొంది. మరోవైపు నగరంలో కుక్కల బెడద నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టిసారించింది. మరోవైపు కుక్కల బెడదపై జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కుక్కల బెడదకు సంబంధించిన జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్ నెంబర్లపై 36 గంటల్లో దాదాపు 15,000 ఫిర్యాదులు వచ్చాయి.
ఇంకా ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతుందని జీహెచ్‌ఎంసీ వర్గాలు తెలిపాయి. పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. తాము ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ వర్గాలు తెలిపాయి. తాము ఎక్కువగా ఫిర్యాదులు నమోదైన ప్రాంతాలను గుర్తించామని.. అక్కడ తక్షణ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నాయి.
మరోవైపు వీధి కుక్కల దాడుల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమయ్యింది. చిన్నారులకు ఈ ముప్పు ఎక్కువగా ఉండటంతో.. ఆ దిశగా వారిల అవగాహన కల్పించేందకు సిద్దమైంది. వీధి కుక్కల దాడుల నివారణపై ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జీహెచ్ఎంసీ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. వీధి కుక్కలు దాడులు చేస్తే తీసుకోవాల్సిన నివారణ, భద్రతా చర్యలపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. శనివారం మూసాపేట్, గాజులరామారం, శేరిలింగంపల్లి పాఠశాల విద్యార్థులకు భద్రత, నివారణ చర్యలపై జీహెచ్‌ఎంసీ అధికారులు అవగాహన కల్పించారు. కుక్కల దాడుల నివారణకు తీసుకోవాల్సిన అంశాలతో కూడిన కరపత్రాలను అధికారులు పంపిణీ చేశారు.
