ప్రజా యుద్దనౌకగా పేరుగాంచిన గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్‌రావు కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. 

ప్రజా యుద్దనౌకగా పేరుగాంచిన గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్‌రావు కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. అయితే గద్దర్ తన పాటలు, ఉద్యమాల రూపంలో చిరస్థాయిగా గుర్తుండి పోతారని ఆయన అభిమానులు పేర్కొంటున్నారు. మరి అలాంటి వ్యక్తి జీవితం ఎలా ప్రారంభమైంది.. గుమ్మడి విఠల్‌రావు నుంచి గద్దర్‌గా ఎలా మారారు? అనేది తెలుసుకుందాం.. 

విఠల్ రావు మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో లచ్చుమమ్మ, శేషయ్యల దంపతులకు 1949లో జన్మించారు. దళిత కుటుంబానికి చెందిన శేషయ్యది అప్పటికే అంబేద్కర్ భావజాలం. శేషయ్య ఆ భావజాలన్నే తన పిల్లలకు అందించారు. అంబేద్కర్ భావజాలంతో పెంపొందించుకున్న ఆత్మగౌరవంతో.. శేషయ్య తన ఆడపిల్లలకు సరస్వతీబాయి, శాంతాబాయి, బాలమణిబాయి అని, మగ పిల్లలకు నర్సింగరావు, విఠల్‌ రావు అనే పేర్లు పెట్టుకున్నారు. విఠల్ రావుపై అంటరానితనం ఉండకూడదని మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపించిన ఆర్యసమాజిస్టు శేషారెడ్డి ప్రభావం తీవ్రంగానే పడింది. చదువులో విఠల్‌ రావు చాలా చురుగ్గా ఉండేవారు. దీంతో బడిలోని శంకరయ్య మాష్టారు విఠల్‌ రావును చేరదీసి.. పాటలు పాడే, నాటకాలు వేసే, బుర్రకథలు చెప్పే సాంస్కృతిక బృందంలో చేర్చుకున్నారు. ఆ బృందంలో విఠల్‌ రావుది ప్రత్యేక స్థానం.

తూప్రాన్‌లోని గద్దర్ ఇల్లు.. (సుప్రభాతం సౌజన్యంతో)

అయితే విఠల్ రావు.. నిజామాబాద్, మహబూబ్‌ నగర్, హైదరాబాద్‌లలో విద్యను అభ్యసించారు. ఆ కాలంలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తొలుత ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్న విమలతో ఆయనకు పరిచయం ఏర్పడింది. బ్యాంకులో ఉద్యోగం సాధించిన తర్వాత విమలను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నేళ్లు బ్యాంకులో ఉద్యోగం చేసి.. ఆ తర్వాత వదిలిపెట్టారు. పీపుల్స్ వార్ గ్రూప్ మద్దతుదారుగా సుదీర్ఘ కాలం పనిచేశారు. జన నాట్య మండలి (పూర్వపు పీపుల్స్ వార్ గ్రూప్ ఔట్‌ఫిట్ సాంస్కృతిక విభాగం) వ్యవస్థాపకులలో ఒకరిగా ఉన్నారు. కొన్నేళ్లు అండర్ గ్రౌండ్‌లో కూడా ఉన్నారు. తన పాటలతో ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై, సమాజంలో పరిస్థితులపై తనదైన శైలిలో గళం విప్పారు. కష్టజీవుల తరఫున వెలువడే సామూహిక గీతంగా ఆయన పాట ఉండేది.

Also Read: 25 ఏళ్లకు పైగా శరీరంలో బుల్లెట్‌తోనే గద్దర్ జీవనం.. 1997లో అసలు ఏం జరిగింది..?

విఠల్ రావు పేరు.. ఆ తర్వాత గద్దర్‌గా స్థిరపడింది. 1971లో విడుదలైన తన మొదటి ఆల్బం పేరు ‘‘గద్దర్’’. ఇదే ఆయన పేరుగా మారింది. గోచీ పెట్టి, గొంగడి భుజాన వేసుకుని ఎర్రజెండా చేతబూని గద్దర్‌ పాటలు పాడుతూ నృత్యం చేస్తుంటే శివుడి విశ్వరూపంలా అనిపించేది. నిర్భయంగా, నిక్కచ్చిగా ప్రభుత్వాల దుమ్ము దూలిపారు. తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక భూమిక పోషించారు. 

మా భూమి చిత్రంలో బండెనక బండికట్టి పాట పాడటంతో పాటు.. ఆ చిత్రంలో నటించారు. 1987లో కారంచేడు దళితుల హత్యలపై గద్దర్ అవిశ్రాంత పోరాటం చేశారు. గద్దర్.. జన నాట్య మండలి (పూర్వపు పీపుల్స్ వార్ గ్రూప్ ఔట్‌ఫిట్ సాంస్కృతిక విభాగం) వ్యవస్థాపకునిగా ఉన్నారు. నకిలీ ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా బలంగా గళం విప్పారు. 1997లో గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. అయితే చాలా కాలం గద్దర్ శరీరంలో బుల్లెట్‌తోనే జీవించారు. ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడారు. ‘‘నీ పాదం మీద పుట్టుమచ్చనై’’ పాటకు గద్దర్‌ను నంది అవార్డు వరించింది. అయితే ఈ అవార్డును ఆయన తిరస్కరించారు. ఇక, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా గద్దర్ తన పాటలతో.. ఉద్యమ స్పూర్తిని రగిలించారు. జై బోలో తెలంగాణ చిత్రంలోని పొడుస్తున్న పొద్దు మీద పాట ఎంతటి ప్రజాాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Also Read: ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత..

ఇదిలా ఉంటే, కొన్నేళ్లుగా ఆయన ప్రజాస్వామ్య రాజకీయ వాదిగా మారారు. పలు పార్టీల నేతలను కలిసి చర్చలు కూడా జరిపారు. అంతేకాకుండా ఇటీవల కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీ కూడా వెళ్లి వచ్చారు.