ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు సూర్యం వెల్లడించారు. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గద్దర్.. 10 రోజుల క్రితం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. అయితే రెండు రోజుల క్రితం ఆయనకు ఆపరేషన్ సక్సెస్ అయినట్టుగా వైద్యులు తెలిపినట్టుగా సమాచారం. అయితే ఈలోపే చికిత్స పొందుతూ గద్దర్ తుదిశ్వాస విడిచారు. గద్దర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయనను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు ప్రముఖులు పరామర్శించిన సంగతి తెలిసిందే. ఇక, గద్దర్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
గద్దర్ మృతిపై అపోలో స్పెక్ట్రా ఆస్పత్రి కూడా ప్రకటన విడుదల చేసింది. అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు గద్దర్ తుదిశ్వాస విడిచినట్టుగా పేర్కొంది. లంగ్స్, యూరీనరీ సమస్యలతో ఆయన బాధపడుతున్నట్టుగా తెలిపింది. ఇక, ఈ నెల 20 గుండె సంబంధిత అనారోగ్యంతో గద్దర్ ఆస్పత్రిలో చేరినట్టుగా పేర్కొంది. ఆగస్టు 3వ తేదీన ఆయన బైపాస్ సర్జరీ చేయడం జరిగిందని.. దాని నుంచి కోలుకున్నారని తెలిపింది. అయితే ఆయన గతంలో ఊపిరితిత్తులు, మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి కావడం, వయసు పైబడటం వంటివి ఆయన మరణానికి దారితీశాయని పేర్కొంది.
ఇక, గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్‌రావు. ఆయన మెదక్ జిల్లా లోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1949లో జన్మించారు. ఆయన నిజమాబాద్, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లలో విద్యను అభ్యసించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేశారు. గద్దర్ ఎన్నో పాటల రాశారు. తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపును తీసుకొచ్చారు.

మా భూమి చిత్రంలో బండెనక బండికట్టి పాట పాడటంతో పాటు.. ఆ చిత్రంలో నటించారు. 1987లో కారంచేడు దళితుల హత్యలపై గద్దర్ అవిశ్రాంత పోరాటం చేశారు. గద్దర్.. జన నాట్య మండలి (పూర్వపు పీపుల్స్ వార్ గ్రూప్ ఔట్‌ఫిట్ సాంస్కృతిక విభాగం) వ్యవస్థాపకునిగా ఉన్నారు. నకిలీ ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా బలంగా గళం విప్పారు. 1997లో గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. అయితే చాలా కాలం గద్దర్ శరీరంలో బుల్లెట్‌తోనే జీవించారు. ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడారు. ‘‘నీ పాదం మీద పుట్టుమచ్చనై’’ పాటకు గద్దర్‌ను నంది అవార్డు వరించింది. అయితే ఈ అవార్డును ఆయన తిరస్కరించారు. ఇక, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా గద్దర్ తన పాటలతో.. ఉద్యమ స్పూర్తిని రగిలించారు. జై బోలో తెలంగాణ చిత్రంలోని పొడుస్తున్న పొద్దు మీద పాట ఎంతటి ప్రజాాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
