హేమంత్‌ను కిరాతకంగా హతమార్చిన వారందరినీ ఎన్‌కౌంటర్‌ చేయాలని అతని భార్య అవంతిరెడ్డి డిమాండ్‌ చేశారు. తమను వారంతా నమ్మించి మోసం చేశారని ఆమె వాపోయారు. తనపై నిజంగా అంత ప్రేమ ఉంటే, తాను ప్రేమించిన హేమంత్‌ను చంపుతారా..? అని అవంతి నిలదీశారు.

అమ్మానాన్నల కంటే అత్తామామే  తనను ఎక్కువగా ప్రేమిస్తారని ఆమె చెప్పారు. తమ ఇంటికి 10 మంది వచ్చి బలవంతంగా తీసుకెళ్లారని... అమ్మానాన్న వద్దకు తీసుకెళ్తామని కిడ్నాప్ చేశారని అవంతి ఆవేదన వ్యక్తం చేశారు.

హత్యలో మేనమామలు పాత్రధారులు అవుతారని అనుకోలేదని ఆమె తెలిపారు. తన మేనమామలు విజేందర్ రెడ్డి, యుగంధర్ రెడ్డి కలిసి కుటపన్ని ఇదంతా చేశారని అవంతి చెప్పారు.

జూన్ 10 అవంతి ఇంట్లో నుంచి వెళ్లిపోగా, జూన్ 11న హేమంత్‌ను పెళ్లి చేసుకుంది. దీనిని జీర్ణించుకోలేని లక్ష్మారెడ్డి దంపతులు ఇంట్లో నుంచి బయటకు రావడం మానేశారు. సోదరి బాధ చూసిన యుగంధర్ రెడ్డి ఎలాగైనా హేమంత్‌ నుంచి అవంతిని దూరం చేయాలని నిర్ణయించుకున్నారు.

Also Read:హేమంత్‌ హత్య: నెల క్రితమే ప్లాన్.. అంతా యుగంధర్ కనుసన్నల్లోనే

హేమంత్‌ను చంపేందుకు కిరాయి హంతకులు కృష్ణా, రాజు, పాషాలతో యుగంధర్ పలుమార్లు చర్చలు జరిపారు. ఈలోపు అవంతికి మాయమాటలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేశారు.

ఈ నెల 24న మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో హేమంత్ ఇంట్లోకి 12 మంది బంధువులు హేమంత్, అవంతిలపై దాడి చేస్తూ లోపలికి చొరబడ్డారు. అనంతరం ఇద్దరిని కారులోకి బలవంతంగా ఎక్కించారు.

లింగంపల్లిలో మాట్లాడుకుందామని చెప్పి బోపన్‌పల్లి వైపు తీసుకెళ్లారు. అయితే మార్గమధ్యంలో అవంతి, హేమంత్ తప్పించుకున్నారు. అవంతి పారిపోగా, హేమంత్ మాత్రం వారికి దొరికిపోయాడు.

రాత్రి 7.30 గంటల సమయంలో నిందితులు కారులోనే హేమంత్‌ను చంపేశారు. ఈ సీన్‌లో లక్ష్మారెడ్డి, అర్చన లేకుండా జాగ్రత్త పడ్డారు. ఈ కేసులో మొత్తం 13 మంది బంధువుల హస్తం వున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

మరోవైపు హేమంత్ మృతదేహానికి అంత్యక్రియలు  పూర్తయ్యాయి. బ్రిటన్‌లో ఉంటున్న హేమంత్ సోదరుడు వచ్చాక అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహం వద్ద తల్లిదండ్రులు, భార్య కన్నీరుమున్నీరుగా విలపించారు.

హేమంత్ హత్య కేసులో తన సోదరుడు ఆశిష్ రెడ్డిని కస్టడీలోకి తీసుకోవాలని మృతుడి భార్య అవంతి డిమాండ్ చేశారు. ఈ హత్యతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం వున్న ఏ ఒక్కరిని వదలొద్దని ఆమె డిమాండ్ చేస్తున్నారు.