తెలంగాణ సిఎం కేసిఆర్ మూడో ఫ్రంట్ పేరుతో చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే గండిపడే అవకాశాలు కనబడుతున్నాయి. భారత రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడమే లక్ష్యంగా కాంగ్రెస్, బిజేపీయేతర ప్రంట్ ఏర్పాటు చేయాలని కేసిఆర్ సంకల్పించారు. గత మూడు రోజులుగా ఈ దిశగా కేసిఆర్ కసరత్తు కూడా చేస్తున్నారు. కేసిఆర్ మూడో ఫ్రంట్ ప్రకటన భారత రాజకీయాల్లో సంచలనంగా టిఆర్ఎస్ ప్రకటించింది. పార్టీ కార్యకర్తలు ఢిల్లీలో కేసిఆర్ కు పాలాభిషేకం చేశారు. తెలంగాణ అంతటా మూడో ఫ్రంట్ పేరుతో పెద్ద చర్చను లేవనెత్తారు సిఎం కేసిఆర్.

కానీ తాను ఫ్రంట్ ప్రకటన చేసిన వెంటనే జాతీయ నేతలు తనను అభినందించారని కేసిఆర్ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తనకు కాల్ చేసి అభినందించారని, నీతో నడుస్తామని మాట ఇచ్చారని కేసిఆర్ వెల్లడించారు. అయితే బెంగాల్ లో ప్రముఖ పత్రిక అయిన టెలిగ్రాఫ్ లో కేసిఆరే ఆమెకు కాల్ చేశారని రాశారు. అంతేకాదు కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ ఉపయోగంలేదన్నట్లు ఆమె మాట్లాడారని ఆ పత్రికలో పేర్కొన్నారు.

ఇక మరో అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. తాజాగా ఆయన ఢిల్లీలో ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలిశారు. రాహుల్ ను కలిసిన తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడారు. రానున్న 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి నడుస్తామని హేమంత్ ప్రకటించారు. జార్ఖండ్ రాష్ట్రంలో తమ పార్టీ (జార్ఖండ్ ముక్తి మోర్చా ) నాయకత్వంలోనే ఎన్నికల్లో పోరాడతామని రాహుల్ తనకు హామీ ఇచ్చినట్లు హేమంత్ ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, తాము కలిసి పనిచేస్తామని హేమంత్ కుండబద్ధలు కొట్టారు.

 అయితే తెలంగాణ సిఎం కేసిఆర్ మాత్రం ఫ్రంట్ ఏర్పాటుపై హేమంత్ హర్షం వ్యక్తం చేశారని, తాను ఫ్రంట్ తో కలిసి పనిచేస్తానని మాట ఇచ్చినట్లు ఇక్కడ వెల్లడించారు. మరి హేమంత్ ఏ ఉద్దేశంతో కేసిఆర్ ఏర్పాటు చేయబోయే ఫ్రంట్ కు మద్దతు పలికారన్నది తేలాల్సి ఉంది. మరో వైపు సీన్ కట్ చేస్తే ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయిన తర్వాత తాము కాంగ్రెస్ కలిసే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని, తమ పార్టీతో జార్ఖండ్ లో కాంగ్రెస్ కలిసి పనిచేస్తుందని రాహుల్ హామీ ఇచ్చినట్లు మీడియాకు వివరించారు. జార్ఖండ్ లో కాంగ్రెస్ మద్దతు లేకుండా జెఎంఎం ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడం సాధ్యం కాదన్నది హేమంత్ సోరెన్ కు బాగా తెలుసు కాబట్టే కేసిఆర్ ప్రతిపాదనను హేమంత్ పట్టించుకోలేదని తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన నేత ఒకరు తెలిపారు. అందుకే ఆయన కేసిఆర్ ప్రతిపాదనను పట్టించుకోకుండా 24 గంటల్లోనే రాహుల్ తో కలిసి ఎన్నికల పొత్తులపై చర్చలు జరిపారని వెల్లడించారు.

మొత్తానికి మూడో ఫ్రంట్ విషయంలో ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన పవన్ కళ్యాణ్, అసదుద్దీన్ ఓవైసి మాత్రమే కేసిఆర్ తో నమ్మకంగా కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చిన పరిస్థితి ఉంది. కేసిఆర్ చెప్పినట్లు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కానీ, జార్ఖండ్ మాజీ సిఎం హేమంత్ సోరెన్ కానీ  కాంగ్రెస్, బిజేపీయేతర ఫ్రంట్ తో కలిసొస్తారన్న నమ్మకాలైతే కనిపించడంలేదు. మరి ఈ విషయంలో కేసిఆర్ ఎలాంటి చతురత ప్రదర్శిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రాహుల్ ఇంటి వద్ద హేమంత్ సోరెన్ మీడియాతో మాట్లాడిన న్యూస్ ఆర్టికల్ (ఎఎన్ఐ వార్తా సంస్థ) లింక్ కింద ఉంది చదవొచ్చు.