ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ రైల్లో దట్టమైన పొగలు... ప్రాణభయంతో ప్రయాణికుల పరుగు
హైదరాబాద్ నుండి హౌరా వెళుతున్న ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ రైల్లో దట్టమైన పొగలు రావడంతో ప్రయాణికులు ప్రాణభయంతో పరుగుతీసారు.

మహబూబాబాద్ : హైదరాబాద్ నుండి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరాకు బయలుదేరిన ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేసింది. మహబూబాబాద్ జిల్లామీదుగా వెళుతుండగా ఈ ట్రైన్ లో దట్టమైన పొగలు మొదలయ్యాయి. దీంతో ఏం జరిగిందో అర్థంకాక ప్రయాణికులు ప్రాణభయానికి గురయ్యారు. రైలు ఆగినవెంటనే కిందకుదిగి భయంతో దూరంగా పరుగుతీసారు.
అయితే కొద్దిసేపటికే పొగలు తగ్గడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ట్రైన్ బ్రేక్ లైనర్స్ పట్టేయడంవల్లే పొగలు వచ్చినట్లు రైల్వే సిబ్బంది గుర్తించారు. వెంటనే సమస్యను పరిష్కరించడం రైలు ముందుకు కదిలింది. మహబూబాబాద్ జిల్లాలోని గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Read More టీచర్స్ డే తర్వాతిరోజే ఘోరం... రైలు కిందపడి రెండు ముక్కలైన ఉపాధ్యాయురాలి శరీరం
ఇటీవల ఒడిషా లోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురవడంతో దాదాపు 300మంది ప్రాణాలు కోల్పోగా మరో 1000 మంది గాయపడ్డారు. ఈ ఘోర రైలు ప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ యాక్సిడెంట్ తర్వాత రైలులో ఏ చిన్న సమస్య ఏర్పడినా ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు.
ఇదిలావుంటే ఇటీవల హౌరా నుండి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. పగిడిపల్లి- బొమ్మాయిపల్లి మధ్య ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదు బోగీలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో బోగీ పాక్షికంగా దగ్దమైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఇక ఇలాగే ముంబై నుంచి సికింద్రాబాద్ వెళుతున్న దేవగిరి ఎక్స్‌ప్రెస్ కు కూడా ఇటీవల ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున మహారాష్ట్రలోని జల్నా జిల్లా సతోనా-ఉస్మాన్‌పూర్ మీదుగా వెళుతున్నసమయంలో పట్టాలపై ఏదో వస్తువు వున్నట్లు దేవగిరి ఎక్స్ ప్రెస్ లోకోపైలట్ గుర్తించాడు. వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేక్ వేసి రైలును నిలిపివేశారు. అనంతరం కిందకి దిగి చూడగా ట్రాక్ మధ్యలో రాళ్లతో నిండిన డ్రమ్ము కనిపించింది. దీనిపై లోకో పైలట్ ఆర్పీఎఫ్‌కు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఆర్పీఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని డ్రమ్మును తొలగించారు. అనంతరం రైలు సికింద్రాబాద్‌కు బయల్దేరింది.