భారీ వర్షాలు: పట్టణాల్లో పరిస్థితులపై మంత్రి కేటీఆర్ సమీక్ష.. ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు
Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో పట్టణాల్లో ఉన్న పరిస్థితుల పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు (కేటీఆర్) సమీక్ష నిర్వహించారు. అలాగే, హైదరాబాద్ నగరంలోని ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటిస్తున్నారు.
Telangana rains: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో పట్టణాల్లో ఉన్న పరిస్థితుల పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు (కేటీఆర్) సమీక్ష నిర్వహించారు. అలాగే, హైదరాబాద్ నగరంలోని ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటిస్తున్నారు. అంతకుముందు, హైదరాబాదు నుంచి పురపాలక శాఖ అధికారులు, అడిషనల్ కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రాథమిక ప్రాధాన్యతగా పని చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపైన అప్రమత్తంగా ఉండాలనీ, వరద నీరు నిలిచిన పట్టణాల్లో మరిన్ని సహాయక చర్యలు చేపడతామని అన్నారు. శిథిల భవనాల నుంచి జనాలను వెంటనే తరలించాలన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు.
పురపాలక శాఖ అధికారులతోనూ కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారని వివరించారు. హైదరాబాద్ నగరంలోనూ జీహెచ్ఎంసి కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఉన్న కిందిస్థాయి సిబ్బంది వరకు అందరూ పనిచేస్తున్నారన్నారు. పురపాలక ఉద్యోగుల అన్ని సెలవులను రద్దు చేయడం జరిగిందనీ, పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా ఇతర మాధ్యమాల ద్వారా సమీక్షిస్తున్నామన్నారు. కుంభవృష్టిగా వర్షం పడడం ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం వలన ప్రజలకు కొంత ఇబ్బంది ఎదురవుతున్నదని అన్నారు. కానీ ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణా నష్టం జరగకుండా సాధ్యమైనని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. తమ ప్రధాన లక్ష్యం ప్రాణ నష్టం జరగకుండా చూడడమేనని పేర్కొన్నారు.
హైదరాబాద్ కు రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందన్నారు. చెరువుల బలోపేతం చేసే కార్యక్రమాలు కూడా చేపట్టామనీ, 135 చెరువులకు గేట్లు బిగించామన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు అధికారులు సిబ్బంది కూడా విస్తృతంగా పనిచేస్తున్నారని తెలిపారు. గతంలో ఇలాంటి భారీ వర్షాలు పడితే అనేక ప్రాంతాలు జలమయం అయ్యేవనీ, అయితే ఈసారి నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా చేపట్టిన కార్యక్రమాలతో వరద ప్రభావం కొంత తగ్గిందన్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఆయా ప్రాంతాల్లో వరద సమస్య బాగా తగ్గిందనీ, ప్రభుత్వము, ప్రభుత్వ యంత్రాంగ పూర్తి సిబ్బంది 24 గంటలు ఈ భారీ వర్షాలను ఎదుర్కొనేందుకు పనిచేస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు మానీ, భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలన్నారు. భారీ వర్షాల్లో నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీసే విధంగా చిల్లర విమర్శలు చేయవద్దని హితవు పలికారు.
వరద పెరిగే ప్రాంతాల్లో ఉన్న పౌరులను అలర్ట్ చేస్తున్నామనీ, ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేస్తూ తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చెరువులకు గండి పడే ప్రమాదం ఉంటే వాటిని కూడా సమీక్షిస్తున్నామనీ, మూసి వరదను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో వర్షాలు తగ్గుముఖం పట్టగానే వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన వరంగల్ నగరానికి వెళ్లాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించామనీ, అవసరమైతే రేపు తాను కూడా స్వయంగా వెళ్తానని మంత్రి కేటీఆర్ చెప్పారు.