బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ శ్రీలంక తీరానికి సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

రాగల 24 గంటల్లో కోమోరిన్ దాని పరిసర ప్రాంతాలలో తీవ్రంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావం కారణంగా రెండు రాష్ట్రాల్లో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా అక్టోబర్ నెలలో తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Also Read:weather report:ఆంధ్రాకు తప్పని వర్షం ముప్పు...ప్రజలకు హెచ్చరిక

సాధారణం కంటే 63 శాతం అధికంగా వర్షాలు నమోదయ్యాయి. అక్టోబర్ నెలలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడం, అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో మంచి వర్షపాతం నమోదైంది.

పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. అక్టోబర్ నెలకు సంబంధించి తెలంగాణలో సగటు వర్షపాతం 84.1 మిల్లీమీటర్లు కాగా.. ఇప్పటి వరకు 137.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

అక్టోబర్ మూడో వారంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం ఉంటుందన్న ఇండో-జర్మన్ పొట్స్‌డామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ శాస్త్రవేత్తల అంచనా నిజమైంది. టిప్పింగ్ ఎలిమెంట్ విధానం ద్వారా ఈ సంస్థ నాలుగేళ్లుగా వాతావరణ మార్పులపై అంచనా వేస్తోంది.

కాగా ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 24 గంట్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Also Read:హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన: పలు ప్రాంతాలు జలమయం

శనివారం నగరంలో ఎండ తీవ్రత పెరిగింది. ఉదయం నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు గరిష్టంగా 31.1 డిగ్రీలు, కనిష్టంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తాజా ఉపరితల ఆవర్తనం తర్వాత తెలంగాణలో వానల జోరు తగ్గనుంది ఒక అధికారి తెలిపారు. 

ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో విశాఖలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర, శ్రీశైలం జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతోంది.