హైదరాబాద్: భారీ వర్షంలో హైదరాబాద్ తడిసి ముద్దవుతోంది. కుండపోతగా వాన కురుస్తుండడంతో రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. ఎల్బీనగర్ నుంచి మాదాపూర్ వరకు ఇక్కడా, అక్కడా అని తేడాలేకుండా వాన దంచికొడుతోంది. వర్షం వల్ల ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. 

కోటి, సుల్తాన్ బజార్ తదితర ప్రాంతాల్లో చిన్న చిన్న దుకాణాల్లోకి నీరు చేరింది. పండగపూట షాపింగ్ కోసం బయటకు వచ్చిన చాలామంది ఆడవారు అక్కడ చిక్కుబడిపోయారు. గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో వర్షం నీటిలో బండ్లు కొట్టుకొనిపోయాయి. 

షాపింగ్ కంప్లెక్సుల, అపార్టుమెంటుల సెల్లార్లలోకి నీరు చేరడంతో అక్కడ పార్క్ చేసిన వాహనాలన్నీ నీటమునిగాయి. ఊర్లకు పోవడానికి బస్సులు లేనందున ప్రైవేట్ వాహనాల కోసం నిరీక్షిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ప్రతిసంవత్సరం కనిపించేంత హడావుడి ఈ సంవత్సరం బతుకమ్మ సంబరాల్లో కనపడడం లేదు. నేడు సద్దుల బతుకమ్మ, దానికి తోడు ఈ భారీ వర్షం అన్నీ వెరసి సాయంత్రం జరిగే సద్దుల బతుకమ్మ ఉత్సవాలపై గట్టిదెబ్బ పడే ఆస్కారం ఉంది.