Heat wave: రాష్ట్రంలో ఎండ‌లు మండిపోతున్నాయి. క్ర‌మంగా ఉష్ణోగ్ర‌త‌లు పెరుగుతున్నాయి. తెలంగాణ‌లోని చాలా ప్రాంతాల్లో వేడిగాలుల తీవ్ర‌త సైతం పెరుగుతోంది.  

Heat wave: వేసవి ప్రారంభంలో ఎండ‌లు మండిపోతున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. దీనికి తోడు వేడిగాలులు పెరుగుతుండ‌టంతో మున్ముందు ఉష్ణోగ్ర‌త‌లు ఏ స్థాయిలో ఉంటాయోన‌ని ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇక మ‌ధ్యాహ్నం వేళ‌ల్లో అయితే.. ఎండ తీవ్ర‌త మ‌రింత ఎక్కువ‌గా ఉండ‌టంతో జ‌నాలు నీడ‌ప‌ట్టుకు చేరుకుంటున్నారు. మార్చి నెల‌లోనే ఉన్న‌ప్ప‌టికీ.. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వేడి తరంగాలు ఉధృతంగా వీస్తున్నాయి. దీంతో గరిష్ట పగటి ఉష్ణోగ్రతలు 40-42 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటున్నాయి. 

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వేడి గాలులు వీయడం ప్రారంభించాయని, ఇది మార్చికి అసాధారణమని వాతావరణ నిపుణులు అంటున్నారు. నల్గొండలో శుక్రవారం అత్యధిక ఉష్ణోగ్రతలు 43.5 డిగ్రీలకు చేరాయి, ఈ సీజన్‌లో న‌మోదైన ఇప్పటివరకు అత్యధిక ఉష్ణోగ్రతలు ఇవే. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. ఇది సాధారణం కంటే 6.1 డిగ్రీలు ఎక్కువ. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత మార్చి రెండవ మరియు మూడవ వారంలో సగటు ఉష్ణోగ్రత 36-37 డిగ్రీల కంటే 2-4 డిగ్రీలు ఎక్కువగా ఉంది.

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం గత 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లాలోని చాప్రాలలో గరిష్టంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే వారం నుంచి ఉష్ణోగ్ర‌త‌లు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గరిష్ట ఉష్ణోగ్రత 41 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నందున వచ్చే ఐదు రోజుల పాటు ఉత్తర తెలంగాణలోని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ లేదా 'బి ప్రిపేర్' హెచ్చరిక జారీ చేయబడింది. గరిష్ట ఉష్ణోగ్రత 36 నుండి 40 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉన్న ఇతర జిల్లాలకు ఎల్లో అలర్ట్ లేదా 'బీ అలర్ట్' హెచ్చరిక జారీ చేయబడింది.

ఆదిలాబాద్‌, కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కొన్నిచోట్ల వేడిగాలులు వీచే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

రాష్ట్రంలో ఎండ‌ల తీవ్ర‌త పెర‌గ‌డంతో ప్రజలు ఉదయం 10 గంటల తర్వాత ఇంట్లోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. చాలా ముఖ్యమైన పనుల కోసం మాత్రమే బయటకు వెళుతున్నారు. బ‌య‌ట‌కు వెళ్లిన వారు మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో రోడ్ల పక్కన నీడ‌లో లేద పార్కుల్లో చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎండ‌ల తీవ్ర‌త పెర‌గ‌డంతో కొబ్బరినీళ్లు, చెరకు, మజ్జిగ, ఇతర శీతల పానీయాలు, ఐస్‌క్రీం, వాటర్ మెలోన్ విక్రయాలు పెరుగుతున్నాయి. 

Scroll to load tweet…