ఎన్నికల తర్వాత కొడంగల్ లో పర్యటించే చాన్స్ తన మనుషుల రిపోర్ట్ ఆధారంగా హరీష్ స్కెచ్ వేడెక్కిన కొడంగల్ పాలిటిక్స్
టిఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిండు మంత్రి హరీష్ రావు. ఆయన రంగంలోకి దిగేవరకే విపక్షాల హడావిడి ఒక్కసారి ఆయన దిగిండంటే... వార్ వన్ సైడే అని బల్లగుద్ది చెబుతుంటారు టిఆర్ఎస్ నాయకులు. నిజానికి హరీష్ రావు టేకప్ చేసిన ఏ ఎన్నికలోనూ టిఆర్ఎస్ పార్టీ వెనుదిరిగి చూడలేదు. తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత హరీష్ హవా అలా ఉన్నది. ఎన్నిక ఏది అనేది ముఖ్యం కాదు.. హరీష్ సీన్ లో ఉన్నారా లేరా? అన్నదే ముఖ్యం అంటారు గులాబీ నేతలు.
ఇంకోమాట చెప్పాలంటే.. టిఆర్ఎస్ లో ఇన్ ఛార్జి బాధ్యతలు తీసుకున్న కేటిఆర్ ఒక దశలో ఓడిపోయిన దాఖలాలున్నాయి. ఎమ్మెల్సీగా దేవీప్రసాద్ రావు పోటీ చేసినప్పుడు ఆ ఎన్నికల బాధ్యతలను మంత్రి కేటఆర్ భుజాన వేసుకున్నారు. కానీ... ఫలితం మాత్రం వ్యతిరేకంగా వచ్చింది. దేవీ ప్రసాద రావు ఓడిపోయాడు. అయితే తర్వాత అదే కేటిఆర్ జిహెచ్ఎంసి ఎన్నికల బాధ్యతలు తీసుకుని గెలిపించాడు. కానీ.. హరీష్ విషయంలో ఎప్పుడూ ఓటమిపాలైన దాఖలాలు లేవని పార్టీనేతలు అంటున్నారు.
కొడంగల్ ఉప ఎన్నిక అంటూ వస్తుందా? రాదా అన్న టెన్షన్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఊపందుకున్నది. కొడంగల్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదని ఎక్కువమంది నేతలు జోస్యం చెబుతున్నారు. కానీ ఎందుకైనా మంచిది.. వచ్చినా రాకపోయినా ముందస్తు ప్రిపరేషన్ చేసుకుంటే మంచిదని ఇటు టిఆర్ఎస్, అటు కాంగ్రెస్ సమాయత్తమవుతున్నాయి.
టిఆర్ఎస్ ఇప్పటికే మంత్రి హరీష్ కు బాధ్యతలు కట్టబెట్టింది. అసెంబ్లీ సమావేశాల తర్వాత హరీష్ రావు కొడంగల్ లో పర్యటించే అవకాశాలున్నట్లు పార్టీ నేతలు సంకేతాలు పంపుతున్నారు. ఆయన పర్యటన వివరాలు అలా ఉంటే.. ఇప్పటికే హరీష్ మనుషులు సీన్ లోకి ఎంటర్ అయ్యారని కొడంగల్ నుంచి సమాచారం అందుతోంది. కొడంగల్ నుంచి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
హరీష్ రావు మనుషులు సుమారు 40 మంది కొడంగల్ లో దిగిపోయిర్రు. సిద్ధిపేట, కరీంనగర్, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన వారు కొడంగల్ లో మకాం వేసినట్లు చెబుతున్నారు. వారంతా ఇప్పటికే ఆపరేషన్ కొడంగల్ షురూ చేశారని అంటున్నారు. కొడంగల్ లోని కులాల వారీగా నాయకులను కలుసుకుని వారిని టిఆర్ఎస్ లోకి చేర్చుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ నడుపుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే కొడంగల్ లోని కొంతమంది లోకల్ లీడర్స్ ను ఆకర్షించినట్లు చెబుతున్నారు. వారంతా టిఆర్ఎస్ గూటికి చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
ఇదేకాకుండా స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసి పూర్తి సమాచారాన్ని వీరు హరీష్ కు అందిస్తారని కూడా చెబుతున్నారు. క్షేత్ర స్థాయి సమాచారాన్ని అంతా క్రోడీకరించి వారిచ్చిన రిపోర్టుల ఆధారంగా హైదరాబాద్ లోనే పక్కా స్కెచ్ వేసి హరీష్ కొడంగల్ కు పోతాడని, అప్పుడు ఆయన వ్యూహాలకు అడ్డు ఉండే ప్రసక్తే లేదని చెబుతున్నారు. మొత్తానికి హరీష్ మనుషుల హడావిడితో కొడంగల్ రాజకీయాలు వేడెక్కిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు.
