హైదరాబాద్: మొన్నటి శాసనసభ ఎన్నికల వరకు తనకు బద్ధ శత్రువుగా వ్యవహరించిన వంటేరు ప్రతాప రెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పార్టీలోకి ఆహ్వానించడానికి వెనక జరిగిన మంత్రాంగమేమిటనేది చర్చనీయాంశంగా మారింది. వంటేరును ఏకంగా రేపు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. 

రెండు సార్లు ప్రతాప రెడ్డి కేసీఆర్ పై పోటీ చేసి గజ్వెల్ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. నిజానికి, వంటేరు ప్రతాప రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతారని, టీఆర్ఎస్ లోకి వంటేరును కేసీఆర్ ఆహ్వానిస్తారని గానీ ఎవరూ అనుకుని ఉండరు. ఇది ఊహించని పరిణామమే.

అయితే, వంటేరు ప్రతాపరెడ్డి టీఆర్ఎస్ లోకి తేవడానికి వెనక మంత్రాంగం నడిపింది కేసీఆర్ మేనల్లుడు, సిద్ధిపేట శాసనసభ్యుడు హరీష్ రావేననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. హరీష్ రావు ప్రమేయం లేకుండా ఆయన పార్టీలోకి వస్తారని ఎవరూ ఊహించరు. ఎన్నికలకు ముందు తన మామను ఓడించాలని, అందుకు అవసరమైన నిధులు సమకూరుస్తానని హరీష్ రావు తనకు ఫోన్ చేసి చెప్పారని వంటేరు ప్రతాప రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  

హరీష్ రావుతో వంటేరు ప్రతాపరెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయని అంటారు. ఆ కారణంగానే వంటేరు తన అభిమతాన్ని ఆయన చెవిన వేశారని సమాచారం. ఆ విషయాన్ని హరీష్ రావు కేసీఆర్ చెవిన వేశారని, కేసీఆర్ అందుకు అంగీకరించారని అంటున్నారు. ప్రతాప రెడ్డి టీఆర్ఎస్ లోకి వస్తే ఆ పార్టీకి వ్యతిరేకంగా నిలబడేది నర్సారెడ్డి మాత్రమే. నర్సారెడ్డి కూడా కాంగ్రెసులో ఉంటారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

వంటేరు నిర్ణయం పట్ల నాయకులు, సహచరులు, కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. అయితే, వారందరినీ ఒప్పించిన తర్వాతనే వంటేరు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు సమాచారం. 

శుక్రవారం ప్రగతి భవన్ లో కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న తర్వాత గజ్వెల్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి ఆయన అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కేసీఆర్ ను ఆహ్వానిస్తారని సమాచారం. 

సంబంధిత వార్తలు

కేసీఆర్ ప్లాన్ ఇదీ: ఒంటేరుకు ఆహ్వానం అందుకే

టీఆర్ఎస్‌లోకి కేసీఆర్ ప్రత్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి