రేవంత్ రెడ్డి టూర్.. ఉప్పల్ కాంగ్రెస్‌లో బయటపడ్డ విభేదాలు.. తీవ్ర ఉద్రిక్తత..!
ఉప్పల్ నియోజవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి ఈరోజు పర్యటించారు. అయితే రేవంత్ పర్యటన వేళ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటకు బయటపడ్డాయి.

టీపీసీసీ చీఫ్ ఉప్పల్ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉప్పల్ నియోజవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి ఈరోజు పర్యటించారు. అయితే రేవంత్ పర్యటన వేళ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటకు బయటపడ్డాయి. రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి పోస్టర్‌ను కార్పొరేటర్ రజిత పరమేశ్వరరెడ్డి వర్గీయులు చించివేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.
అయితే తర్వాత రాగిడి లక్ష్మారెడ్డి మళ్లీ ఫ్లెక్సీలు కట్టేందుకు సిద్దమయ్యారు. అయితే రాగిడి లక్ష్మారెడ్డి ఫ్లెక్సీలలో ప్రోటోకాల్ ప్రకారం స్థానిక కార్పొరేటర్ రజిత పరమేశ్వరరెడ్డి ఫోటో లేదని పరమేశ్వరరెడ్డి వర్గీయులు వాదనను దిగారు. ఈ క్రమంలోనే ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. రేవంత్ రెడ్డి పర్యటన వేళ ఉప్పల్ కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఇక, ఉప్పల్‌లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన సహాయక చర్యలు తీసుకోకపోవడం రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిందని విమర్శించారు. ఒక ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. రానున్న ఏడాదికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదని మండిపడ్డారు. హైదరాబాద్‌లో చిన్న చినుకు పడితే రోడ్డుపై వరదలా పారుతుందని అన్నారు. భారీ వర్షాలపై ముందుస్తు హెచ్చరికలు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.
వరద బాధితులు ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించడం లేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ద ప్రజల ప్రాణాలపై లేదని విమర్శించారు. వరద ముప్పుపై సమీక్షలు చేయకుండా రాజకీయాలపై దృష్టిపెట్టారని మండిపడ్డారు. కేంద్రం తాత్కాలిక వరద సాయం కింద రాష్ట్రానికి రూ. వెయ్యి కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వరద సాయం తీసుకోవాల్సిన బాధ్యత కిషన్‌రెడ్డిపై ఉందని అన్నారు.