వరంగల్ జిల్లాలో గ్రూప్-2 ఉద్యోగి కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఖమ్మంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న మోపు ఆనంద్ రెడ్డి అనే అధికారి గత నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయారు.

ఈ నెల 7న ఆయన తన స్నేహితుడు ప్రదీప్ రెడ్డితో కలిసి బయటకు వెళ్లారు. అప్పటి నుంచి మళ్లి ఇంటికి తిరిగి రాలేదు. తొలుత ఏదైనా పనిమీద ఆనంద్ రెడ్డి బయటకు వెళ్లి వుంటారని భావించినప్పటికీ నాలుగు రోజులు అవుతున్నా ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆయన కుటుంబసభ్యులు హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read:మైనర్ బాలికను కిడ్నాప్ చేసి... బలవంతంగా పెళ్లి..

రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా వుండగా ఆనంద్ రెడ్డి స్నేహితుడు ప్రదీప్ రెడ్డి సైతం పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

అయితే స్థానికంగా మాత్రం ఆయనను కమలాపూర్‌కు చెందిన ఇసుక వ్యాపారులు కిడ్నాప్ చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన అదృశ్యం వెనుక ఓ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ప్రమేయం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.

Also Read:అత్యాచారం, శీలానికి వెలకట్టి.. కండిషన్స్ పెడుతున్న పొలిటికల్ లీడర్

మొబైల్ సిగ్నల్స్ ద్వారా ఆనంద్ రెడ్డి ఆచూకీని ట్రేస్ చేసేందుకు ప్రయత్నించగా.. భూపాలపల్లి అడవి దగ్గర ఆయన సెల్ సిగ్నల్స్ ఆగిపోయాయి. దీంతో పోలీసులు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఏకంగా ప్రభుత్వోద్యోగి కిడ్నాప్ అయినట్లుగా వార్తలు వస్తుండటంతో అధికార వర్గాల్లో ఆనంద్ రెడ్డి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.