గ్రూప్-2ను వాయిదా వేయండి.. టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించిన అభ్యర్థులు..
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) కార్యాలయాన్ని గ్రూప్-2 అభ్యర్థులు ముట్టడించారు. ఆగస్టు చివరిలో జరిగే గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని వారు డిమాండ్ చేశారు.

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) కార్యాలయాన్ని గ్రూప్-2 అభ్యర్థులు ముట్టడించారు. ఆగస్టు చివరిలో జరిగే గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని వారు డిమాండ్ చేశారు. పెద్దఎత్తున తరలించిన అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గ్రూప్-2 రివిజన్‌కు టైమ్ దొరకడం లేదని.. నోటిఫికేషన్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని.. అయితే ఎగ్జామ్స్ మధ్యలో గ్యాప్ ఉండేలా చూడాలని టీఎస్‌పీఎస్సీని కోరారు.
టీఎస్‌పీఎస్సీ ఇప్పటివకే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఆగష్టు 29, 30తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ఆగస్టు 1 నుంచి 23 గురుకుల బోర్డు పరీక్షలు ఉన్నాయని.. ఆ తర్వాత వారం రోజుల గ్యాప్‌లోనే గ్రూప్-2 పరీక్షలు ఉన్నాయని రెండు పరీక్షలకు దరఖాస్తు చేసిన పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. రెండు పరీక్షల సెలబస్ వేర్వేరుగా ఉంటుందని.. అందుకే రెండు లేదా మూడు నెలలు వాయిదా వేయాలని వారు కోరారు. అయితే ఇది తమ సమస్యే కాదని.. వరుసగా పరీక్షలు ఉండటంతో సరైన విధంగా రివిజన్‌కు టైమ్ దొరకడం లేదని చెబుతున్నారు.
ఇదిలాఉంటే, తెలంగాణలోని కానిస్టేబుల్ అభ్యర్థులు హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. డీజపీ ఆఫీసు ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే పోలీసులకు, కానిస్టేబుల్ అభ్యర్థులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. కానిస్టేబుల్ నోటిఫికేసన్‌లో తీసుకువచ్చిన జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. జీవో 46 లో ఉన్న రేషియో వల్ల చాలామంది అభ్యర్థులు నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాతపద్దతిలోనే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కానిస్టేబుల్ అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగడంతో.. ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.