వరంగల్: తెలంగాణలో సంచలనం సృష్టించిన 9 మంది హత్య కేసులో మరో సంచలన విషయం వెలుగు చూసింది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గోనెసంచుల గోదాములో 9 మందిని హత్య చేసిన సంజయ్ కుమార్ యాదవ్ మరో హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆ హత్యను కప్పిపుచ్చుకునేందుకే ఈ 9 మందిని హత్య చేశాడని భావిస్తున్నారు. 

మక్సూద్ కు సన్నిహిత బంధువైన ఛోటీ కనిపించకుండా పోయింది. సంజయ్ కుమార్ యాదవ్ తో ఆమె సన్నిహితంగా ఉంటూ వచ్చింది. ఆమె కనిపించకపోవడం వెనక సంజయ్ కుమార్ హస్తం ఉందని మక్సూద్ అనుమానిస్తూ వచ్చాడు. ఆమె ఆచూకీ కోసం సంజయ్ కుమార్ యాదవ్ మీద ఒత్తిడి పెడుతూ వచ్చాడు.

Also Read: గొర్రెకుంట హత్యల కేసులో మరో ట్విస్ట్: వెనక ఆ మహిళ

 

ఆ యువతి ఛోటీని సంజయ్ కుమార్ మార్చి 8వ తేదీన నిడదవోలు వద్ద హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సంజయ్ కుమార్ యాదవ్ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. రైలు నుంచి కిందికి తోసేసి ఆమెను చంపాడని అంటున్నారు. కోల్ కతా తీసుకుని వెళ్తానని నమ్మించి సంజయ్ ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది.

ఛోటీ ఉదంతంపై మక్సూద్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాడని సంజయ్ కుమార్ అనుమానిస్తూ వచ్చాడు. దాంతో మక్సూద్ కుటుంబ సభ్యులందరినీ మట్టుబెట్టేందుకు పథకం రచించి అమలు చేసినట్లు చెబుతున్నారు. హత్యలకు సంబంధించిన ఏ విధమైన సాక్ష్యాలు కూడా ఉండకూడదనే ఉద్దేశంతో ఇద్దరు బీహారీ యువకులను కూడా సంజయ్ కుమార్ హత్య చేసినట్లు చెబుతున్నారు. 

సంజయ్ కుమార్ మొత్తం పది హత్యలు చేశాడు. సంజయ్ కుమార్ కు మరో ఇద్దరు యువకులు సహకరించినట్లు తెలుస్తోంది. గొర్రెకుంట హత్యల కేసులో పోలీసులు నిందితులను త్వరలో మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Also Read: బావిలో మృతదేహాల మిస్టరీ: సంజయ్ కుమార్ భార్య అదృశ్యం

తెలంగాణలోని వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గన్నీ సంచుల గోదాం సమీపంలోని బావిలో తేలిన తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడింది. బావిలో శవాలై తేలినవారంతా హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. తానే వారిని హత్య చేసినట్లు బీహారీ కార్మికుడు సంజయ్ కుమార్ యాదవ్ అంగీకరించినట్లు తెలిసింది. 

ముందు రచించిన పథకం ప్రకారం... వరంగల్ నగరంలోని నాలుగైదు మెడికల్ షాపుల నుంచి సంజయ్ కుమార్ నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. హత్య చేసే రోజు కూల్ డ్రింక్స్ లో నిద్రమాత్రులు కలిపి స్నేహితులతో కలిసి హత్య చేసినట్లు చెబుతున్నారు. నిద్ర మాత్రల ప్రభావంతో వారు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే బతికుండగానే స్నేహితుల సాయంతో వారందరినీ బావిలో పడేసినట్లు చెబుతున్నారు.