వరంగల్: తెలంగాణలోని వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గన్నీ సంచుల గోదాం సమీపంలోని బావిలో తేలిన తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడింది. బావిలో శవాలై తేలినవారంతా హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. తానే వారిని హత్య చేసినట్లు బీహారీ కార్మికుడు సంజయ్ కుమార్ యాదవ్ అంగీకరించినట్లు తెలిసింది. 

పథకం ప్రకారం వారిని హత్య చేసినట్లు సంజయ్ కుమార్ చెప్పినట్లు తెలిసింది. సంజయ్ కుమార్ యాదవ్ నివాసంలో జరిపిన సోదాల్లో మరిన్ని అధారాలు దొరికినట్లు తెలుస్తోంది. పోలీసులు సోదాలు చేసినప్పుడు సంజయ్ కుమార్ భార్య కనిపించలేదు. ఆమె ఎక్కడికి వెళ్లిందని అడిగితే బీహార్ లోని తమ ఇంటికి వెళ్లిందని సంజయ్ కుమార్ చెప్పాడు. దాంతో పోలీసులు అక్కడికి ఫోన్ చేసి అడిగారు. ఆమె అక్కడికి రాలేదని వారు చెప్పారు. ఆమె ఏమైందనేది అంతు చిక్కడం లేదు. 

Also Read: ఆర్ధిక లావాదేవీలే కారణం... గొర్రెకుంట హత్య కేసులో మిస్టరీని ఛేదించిన పోలీసులు

ముందు రచించిన పథకం ప్రకారం... వరంగల్ నగరంలోని నాలుగైదు మెడికల్ షాపుల నుంచి సంజయ్ కుమార్ నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. హత్య చేసే రోజు కూల్ డ్రింక్స్ లో నిద్రమాత్రులు కలిపి స్నేహితులతో కలిసి హత్య చేసినట్లు చెబుతున్నారు. నిద్ర మాత్రల ప్రభావంతో వారు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే బతికుండగానే స్నేహితుల సాయంతో వారందరినీ బావిలో పడేసినట్లు చెబుతున్నారు. 

సంజయ్ కుమార్ వెనక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యలకు ఆర్థిక లావాదేవీలు కారణమా, వివాహేతర సంబంధాలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంజయ్ కుమార్ యాదవ్ తో పాటు మక్సూద్ ఆలం మరదలు, యాకూబ్, మంకుషా, ఆటో డ్రైవర్ మోహన్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.

See Video: అసలేమైంది... 9 మంది మరణం వెనక వాస్తవం....?

స్తంభంపల్లిని సంజయ్ కుమార్ యాదవ్ ఇంట్లో లభ్యమైన ఆధారాలే పోలీసులకు కీలకంగా మారినట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తు క్రమంలో పోలీసులకు గొర్రెకుంట బావి సమీపంలో రాంచందర్ అనే వ్యక్తి ద్వారా రెడు సెల్ ఫోన్లు దొరికాయి. అవి మక్సూద్ ఆలం, ఆయన భార్య నిషాకు చెందినవి. ఆ సెల్ ఫోన్ల కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముందుకు సాగించారు. 

ఈ నెల 20వ తేదీ సాయంత్రం 7 గంటలకు ముందు వెంకట్రామ థియేటర్ సమీపంలో యాకూబ్, డ్రైవర్ షకీల్, సంజయ్ కుమార్ కలుసుకుని గొర్రెకుంటలోని మక్సూద్ ఇంటికి వెళ్లారు. ఆ మర్నాడు ఉదయం 6.30 గంటలకు యాకూబ్, సంజయ్ కుమార్ మాత్రమే వెంకట్రామ థియేటర్ చౌరస్తా నుంచి ఇంటికి వెళ్లడం సీసీటీవీల్లో రికార్డయింది. 

హత్యలు జరిగిన మర్నాడు ఈ నెల 21వ తేదీ ఉదయం మక్సూద్ ఇంట్లో గ్యాస్ స్టవ్ తప్ప సిలిండర్ తో సహా ఇతర సామగ్రి కనిపించలేదు. ఆ సిలిండర్, సామగ్రి సంజయ్ యాదవ్ ఇంట్లో కనిపించింది. ఆ సమయంలోనే సంజయ్ కుమార్ భార్య గురించి ఆరా తీశారు. అయితే, ఆమె బీహార్ కు వెళ్లినట్లు సంజయ్ చెప్పాడు.