ఒకవైపు పెద్ద నేతలంతా వలసబాట పడుతున్నారు. మరోవైపు కేడర్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అధినేత చంద్రబాబు ఆంధ్రాకే పరిమితమైపోయారు. ఇక ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టిఆర్ఎస్ తీవ్రమైన వత్తిడి పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో గుట్కు మిట్కు మంటూ తెలంగాణ టిడిపి తమ్ముళ్లు కాలమెల్లదీస్తున్నారు. పార్టీలో ఉన్న నాయకులు కూడా పార్టీ జెండా పీకేద్దాం.. టిఆర్ఎస్ లో విలీనం చేసేద్దామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో టిడిపి భవిష్యత్తు ఎట్లుంటుందో అన్న ఆందోళన ఉంది. కానీ.. ఆ పార్టీలో చేరేందుకు ఒక కీలక నేత ముందుకొచ్చారు. రేపు చంద్రబాబు సమక్షంలో కండవా కప్పుకుని టిడిపి బలోపేతానికి పనిచేస్తానని ప్రకటించారు. ఆయన మాజీ ఎమ్మెల్యే గా పనిచేశారు. మరి ఎవరా కీలక నేత? ఏమా కథ అనుకుంటున్నారా? అయితే చదవండి.

మహబూబాబాద్‌ మాజీఎమ్మెల్యే బండి పుల్లయ్య తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 7న టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు. బుధవారం చంద్రబాబునాయుడు హైదరాబాద్ వస్తున్నారు. దీంతో చంద్రబాబు సమక్షంలోనే బండి పుల్లయ్య చేరిక ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  బుధవారం ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో బండి పుల్లయ్యతో పాటు ఆయన అనుచరులు చంద్రబాబును కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ లభించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం కందికొండకు చెందిన ఆయన విద్యార్థి దశ నుంచే వామపక్ష భావజాలంతో పనిచేస్తూ కమ్యూనిస్టు పార్టీ ముఖ్య నాయకుడిగా ఎదిగారు. ఆ క్రమంలోనే రాజకీయాల్లో స్థిరపడ్డారు. మహబూబాబాద్‌ నియోజకవర్గంలో 1994 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం మిత్ర పక్షాల సీపీఐ అభ్యర్థిగా తొలిసారి కాంగ్రెస్‌ కంచుకోటకు బీటలు వారేట్టు చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కాలుమోపారు.

1999 తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో 2001లో టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపకుల్లో సభ్యుడిగా పనిచేశారు. తర్వాత క్రమంలో మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌ నెలకొల్పిన నవతెలంగాణ పార్టీ లో చేరారు. ఆ పార్టీ పీఆర్‌పీలో వీలినం అయ్యాక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తిరిగి బండి పుల్లయ్య గత కొద్ది కాలంగా క్రియాశీలక రాజకీయాల్లో పనిచేసేందుకు ఉత్సాహం కనబరుస్తూ వచ్చారు. అందులో భాగంగానే టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఒకవైపు ఉన్న లీడర్లంతా ఆకర్ష్ పేరుతో పార్టీని వీడుతున్న తరుణంలో ఒక మాజీ ఎమ్మెల్యే పార్టీలోకి రావడం.. తెలంగాణ టిడిపి తమ్ముళ్లకు జోష్ పెంచే విషయమే అని చెప్పవచ్చు.