హైద‌రాబాద్ న‌గ‌ర ప్ర‌జ‌ల సౌక‌ర్యార్థం న‌గరంలో 38 పార్కుల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేస్తున్న‌ట్ట న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ తెలియ‌జేశారు. కేబీఆర్ పార్కులో నిర్మాణంలో ఉన్న‌ ఓపెన్ జిమ్‌ను నేడు మేయ‌ర్ రామ్మోహ‌న్‌ ప‌రిశీలించారు. కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్స్‌బులిటీలో భాగంగా ఒక ప్రైవేట్ సంస్థ త‌న నిధుల‌తో కేబీఆర్ పార్కు స‌మీపంలోని ఈ ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ఓపెన్ జిమ్‌లో ఏర్పాటు చేసిన ఆధునిక జిమ్ ప‌రిక‌రాల‌ను వాటి ప‌నితీరును మేయ‌ర్ రామ్మోహ‌న్ ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా మేయ‌ర్ మాట్లాడుతూ కేబీఆర్ పార్కు స‌మీపంలో ఏర్పాటు చేస్తున్న ఓపెన్ జిమ్ మ‌రో ప‌ది రోజుల్లోగా అందుబాటులోకి తేనున్న‌ట్టు పేర్కొన్నారు. న‌గ‌రంలో ఇప్ప‌టికే ఆరు ప్ర‌ధాన పార్కుల్లో ఓపెన్ జిమ్‌ల‌ను ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. గ్రేట‌ర్‌ హైద‌రాబాద్‌లో మ‌రో 38పార్కుల్లో ద‌శ‌ల‌వారిగా ఓపెన్ జిమ్‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్నామ‌ని తెలిపారు. న‌గ‌ర పార్కుల‌ను న‌గ‌ర‌వాసులు సంద‌ర్శించి ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణాన్ని ఆస్వాధిస్తున్నార‌ని, ఈ పార్కుల‌లో   మార్నింగ్‌, ఈవీనింగ్ వాక‌ర్స్ కు మ‌రింత సౌల‌భ్యం క‌లిగించేలా ప్ర‌ధాన పార్కుల‌లో వినూత్నంగా ఓపెన్ జిమ్‌ల‌ను ఏర్పాటుచేస్తున్నామ‌ని వివ‌రించారు. దీనిలో భాగంగా మొద‌టి ద‌శ‌లో ఆరు ప్ర‌ధాన పార్కుల్లో ఓపెన్ జిమ్‌ల‌ను ఏర్పాటుచేశామ‌ని తెలిపారు. దాదాపు 50ల‌క్ష‌ల 60వేల వ్య‌యంతో ఈస్ట్‌జోన్ ప‌రిధిలోని డాక్ట‌ర్ ఏ.ఎస్‌.రావు పార్కు, వెస్ట్‌జోన్ ప‌రిధిలోని గుల్మోహ‌ర్ పార్కు, సౌత్‌జోన్ ప‌రిధిలోని ఇమ్లీబ‌న్ పార్కు, సెంట్ర‌ల్ జోన్ ప‌రిధిలోని ఇందిరాపార్కు, కృష్ణ‌కాంత్ పార్కు, నార్త్‌జోన్ ప‌రిధిలో నెహ్రూన‌గ‌ర్ పార్కుల‌లో ఏర్పాటుచేసిన‌ ఈ ఔట్‌డోర్ ఓపెన్ జిమ్‌ల‌ను ప్ర‌తిరోజు వంద‌లాది మంది ఉప‌యోగిస్తున్నార‌ని బొంతు రామ్మోహ‌న్ తెలిపారు.

ముఖ్యంగా వాకింగ్‌కు వ‌చ్చే న‌గ‌ర‌వాసులకు ఆధునిక జిమ్ ప‌రిక‌రాల‌ను వినియోగించుకోవ‌డం ద్వారా పూర్తి ఫిట్నెస్‌తో ఉండ‌టానికి దోహ‌ద‌ప‌డుతున్నాయ‌ని పేర్కొన్నారు. ఈ ఓపెన్ జిమ్‌ల‌లో లెగ్‌ప్రెస్‌, లెగ్‌స్ట్రెచ్ స్ట్రేట్‌, లెగ్‌స్ట్రెచ్ సైడ్స్‌, చెస్ట్ పుష్‌, ట్విస్ట‌ర్లు, పెండూలం, వ‌ర్టిక‌ల్ షోల్డ‌ర్‌హుల్, అబ్డామిన‌ల్ రైడ‌ర్‌, షోల్డ‌ర్ ఫ్లై, రోవ‌ర్‌, క్రాస్‌ట్రైన‌ర్‌, షౌల్డ‌ర్ ఫిస్ట్‌, సీట‌ర్‌క్విస్ట‌ర్‌, ఏబి బోర్డ్‌, టైచై త‌దిత‌ర ఆధునిక జిమ్ ప‌రిక‌రాల‌ను ఏర్పాటు చేశామ‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా స్పోర్ట్స్ విభాగం ఓఎస్‌డి ప్రేమ్‌రాజ్, డిప్యూటి క‌మిష‌న‌ర్ స‌త్యనారాయ‌ణ‌, ఇఇ చిన్నారెడ్డి త‌దిత‌రులు కూడా పాల్గొన్నారు.