సారాంశం

గంజాయి మత్తులో ఓ ఆకతాయి గ్యాాంగ్ ఇద్దరు యువకులపై కత్తులతో దాడికి దిగిన ఘటన ఖమ్మం పట్టణంలో చోటుచేసుకుంది. ఈ దాడిలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా మరో యువకుడు ప్రాణాపాయస్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. 

ఖమ్మం : విచ్చలవిడిగా లభిస్తున్న డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. మత్తులో ఏం చేస్తున్నారో తెలియక యువత నేరాలబాట పడుతున్నారు. ఇలా  గంజాయి మత్తులో కొందరు యువకుల మధ్య జరిగిన గొడవలో ఒకరు హత్యకు గురవగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో వున్నారు. ఈ దారుణం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. 

ఖమ్మం పట్టణంలోని పంపింగ్ వెల్ రోడ్డులో కొందరు యువకులు ఘర్షణ జరిగింది.సాయి పవన్, సాయి అనే ఇద్దరు యువకులపై గంజాయి మత్తులో వున్న ఓ గ్యాంగ్ కత్తులతో దాడి చేసింది. కత్తిపోట్లకు గురయి తీవ్ర రక్తస్రావం కావడంతో సాయి పవన్ మృతిచెందాడు. మరో యువకుడు సాయి తీవ్రగా గాయపడటంతో నగరంలోకి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. 

యువకుల గొడవపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లేసరికి సాయి పవన్ మృతదేహం రక్తపుమడుగులో పడివుంది. దీంతో మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Read More  వనపర్తి : కలుషిత ఆహారం తిని 70మంది కేజిబివి విద్యార్థినులు అస్వస్థత

సాయి పవన్ ను హత్యచేసిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ గొడవలో ఎవరెవరు పాల్గొన్నారు? ఇద్దరు యువకులపై కత్తులతో దాడిచేసింది ఎవరు? అసలు గొడవ ఎలా ప్రారంభమయ్యింది? అనేది తెలుసుకునేందుకు పంపింగ్ హౌస్ రోడ్డులోని సిసి కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

ఇదిలావుంటే పుష్ఫ సినిమాలో హీరో పోలీసుల కళ్లుగప్పి ఎర్రచందనం తరలించినట్లు ఓ ముఠా గంజాయిని తరలించేందుకు ప్రయత్నించి పోలీసులకు పట్టుబడింది. భారీగా గంజాయిని విజయవాడకు స్మగ్లింగ్ చేస్తున్నట్టు ఎన్టీఆర్ జిల్లా పోలీసులకు సమాచారం అందింది. దీంతో వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు ప్రసాదంపాడు వద్ద జాతీయ రహదారిపై రెండు వాహనాలను పట్టుకున్నారు. ఓ కారు డిక్కీలో 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అందులోని వారిని అదుపులోకి తీసుకున్నారు. 

మరో వాహనంలో ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉల్లిపాయల బస్తాలకింద గంజాయి పెట్టి తరలించినా పోలీసులు గుర్తించారు.గోనెసంచుల్లో 255 కిలోల గంజాయిని మూటగట్టి స్మగ్లింగ్ చేస్తున్నారు. అనుమానంతో ఉల్లిపాయల బస్తాలు తీసిచూసిన పోలీసులకు గంజాయి బస్తాలు పట్టుబడ్డాయి. దీంతో గంజాయి బస్తాలతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

 ఇలా రెండు వాహనాల్లో పట్టుబడిన 400కిలోల గంజాయి విలువ రూ.80 లక్షలపైనే వుంటుందని పోలీసులు తెలిపారు. పట్టుబడిన ఆరుగురు స్మగ్లర్లను విజయవాడ కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు పోలీసులు.