కస్తూర్భా హాస్టల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది.
వనపర్తి : కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురయిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. అమరచింతలోని కేజిబివి లో గురువారం రాత్రి భోజనం తర్వాత విద్యార్థులంతా వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. కడుపునొప్పితో విలవిల్లాడిపోయిన విద్యార్థులను కేజిబివి సిబ్బంది కనీసం హాస్పిటల్ కు తరలించలేకపోయారు. దీంతో ఉదయానికి వారి పరిస్థితి మరింత విషమించింది.
అస్వస్థతకు గురయిన 70మంది విద్యార్థులను మొదట ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో 40మంది విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా వుండటంతో వారిని మెరుగైన వైద్యం కోసం వనపర్తి జిల్లా హాస్పిటల్ కు తరలించారు.
Read More టిఎస్ఆర్టిసి రాజధాని ఎక్స్ప్రెస్ బస్సులో అగ్నిప్రమాదం..
గురువారం రాత్రి వంకాయ కూర, సాంబారుతో భోజనం చేసి నిద్రపోయిన విద్యార్థులు అర్థరాత్రి వాంతులు చేసుకున్నారు. విద్యార్థులందరూ ఒక్కసారిగా అస్వస్థతకు గురవడంతో విధుల్లో వున్న టీచర్ కు ఏం చేయాలో పాలుపోలేదు. డ్యూటీలో ఒక్కరే వుండటంతో ఇంతమంది విద్యార్థులను హాస్పిటల్ కు తీసుకెళ్లడం సాధ్యంకాలేదని చెబుతున్నారు. దీంతో ఉదయం వరకు విద్యార్థులు అలాగే కడుపునొప్పితో నరకం అనుభవించారు.
రాత్రంతా కడుపునొప్పితో బాధపడుతున్నా తమ బిడ్డలను కేజిబివి సిబ్బంది పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినుల ప్రాణాలతో చెలగాటం ఆఢిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
