మహబూబ్‌నగర్‌లో ఓ యువతి తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంది. దీన్ని ఆమె తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. తన కూతురు మరణించిందని భావించి శ్రద్ధాంజలి ఘటిస్తున్న పోస్టర్లను వేయించాడు.
హైదరాబాద్: పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకోవడం తల్లిదండ్రులకు సాధారణంగా మింగుడుపడదు. ముందే ప్రేమ వ్యవహారం తెలిస్తే ఏదో రకంగా వారిని అదుపులో పెట్టుకోవాలని ప్రయత్నిస్తారు. చివరకు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసైనా ఆ ప్రేమ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. కూతురే అయితే.. వెంటనే పెళ్లి చేసేసి అత్తింటికి పంపించేస్తారు. ఇదంతా మనం చూస్తున్నదే. అయితే.. గద్వాల కూతురు ప్రేమ పెళ్లి చేసుకున్నదని ఆ తండ్రి చేసిన పనికి అందరూ విస్తుపోతున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్‌కు చెందిన డాక్టర్ సోమేశ్వరీ, రాజశేఖర్‌లు ప్రేమించుకుంటున్నారు. రాజశేఖర్ పోలీసు కానిస్టేబుల్. ఇద్దరూ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. వారు నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆమె ప్రేమ పెళ్లిని తండ్రి జీర్ణించుకోలేకపోయాడు.
కూతురు తమను కాదని లవర్‌ను పెళ్లి చేసుకోవడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఇందులో నుంచే తండ్రి ఓ తీవ్ర నిర్ణయాన్ని తీసుకున్నాడు. తనకు ఇక కూతురే లేదనే అభిప్రాయానికి వచ్చాడు. తన కూతురు చనిపోయిందనే భావిస్తానని అనుకున్నాడు. ఈ విషయాన్ని బయటకు తెలిసే.. కూతురు శ్రద్ధాంజలి ఘటిస్తున్న పోస్టర్లు వేయించాడు. ఇప్పుడు ఆ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: కేసీఆర్‌తో అఖిలేశ్ యాదవ్ భేటీ.. ‘బీజేపీని గద్దె దింపడమే అందరి లక్ష్యం’
తమను కాదని వెళ్లిపోయి లవ్ మ్యారేజీ చేసుకుంటే.. తల్లిదండ్రులు ఇలా విపరీతంగా వ్యవహరించిన ఘటనలు గతంలోనూ ఉన్నాయి. పండ ప్రదానం చేయడం, చనిపోయినట్టు ఇంటిలో ఫొటోలకు దండలు వేయడం, సోదరులు గుండు కొట్టించుకోవడం వంటి చర్యలు పలుమార్లు వార్తల్లోకి ఎక్కాయి.
