Gaddar: ప్రజాగాయకుడు గద్దర్ అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం చివరి శ్వాస విడిచారు. 

Gaddar: ప్రజా సమస్యలపై గొంతెత్తిన ‘ప్రజా యుద్ధనౌక’ మూగబోయింది. ఇక సెలవంటూ నింగికేసింది. తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిర్లు ఊదిన ఆ గొంతు శాశ్వతంగా మూగబోయింది. ప్రజా గాయకుడు గద్దర్ (Gaddar)తుది శ్వాస విడిచారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఆగస్టు 6) మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. అయితే.. గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత నెల 31 న ప్రజలకు ఓ బహిరంగ లేఖ రాశారు. 

గద్దర్ రాసిన చివరి లేఖ ఇదే.. 

నా పేరు గుమ్మడి విఠల్. నా పాట పేరు గద్దర్ .. నాది సుధీర్ఘ బతుకు పోరాటం. నా వయస్సు 76 ఏండ్లు. ఈ పోరాటంలో నా వెన్నుపూస ఇరుక్కున్న తూటా వయస్సు 25 ఏండ్లు.. ఇటీవల నేను పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మద్దతు పలికాను. మా భూములు మాకే పాదయాత్రలో పాల్గొన్నాను. 

నా పేరు జనం గుండెల చప్పుడు. నా గుండె చప్పుడు ఆగిపోలేదు. కానీ, ఎందుకో గుండెకు గాయమైంది. ఈ గాయానికి చికిత్స కోసం అమీర్ పేటలోని అపోలో ఆస్పత్రిలో చేరాను. జూలై 20 నుంచి నేటీ ( జూలై 31) వరకు పలు చిక్సితలు, చికిత్సలు పొందుతూ కుదుట పడుతున్నాను. పూర్తి ఆరోగ్యంతో కోలుకొని తిరిగి ప్రజా పోరాటంలో అడుగుపెడుతాను. మీ మధ్యకు వచ్చి సాంస్కృతిక ఉద్యమం తిరిగి ప్రారంభిస్తాను. ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రజల సాక్షిగా మాట ఇస్తున్నాను" అని ప్రజాకవి గద్దర్ బహిరంగ లేఖ రాశారు.