హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఘటన
నాలుగేళ్ల వయసులో రోజూ స్కూల్ కు వెళ్లడానికి భయపడిపోతుంటారు కొందరు పిల్లలు. ఇక టీచర్లంటే హడలీపోతుంటారు.
అలాంటిది ఓ బుడతడు ఆ వయసులోనే ఏకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు.
తన నానమ్మ ను అరెస్టు చేయాలని స్టేషన్ లో ఉన్న ఎస్ ఐ కి ఆర్డర్ వేశాడు.
శుక్రవారం ఎస్ ఆర్ నగర్ పోలీసు స్టేషన్ లో ఈ ఘటన జరిగింది.
ఎస్ ఆర్ నగర్ కు చెందిన శివ కుమారుడు చైతన్య కు నాలుగేళ్లు.
స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు.
రాత్రి 9.30 కు ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు ఒంటరిగా వచ్చిన చైతన్య నానమ్మ ను జైళ్లో పెట్టాలని అక్కడ ఉన్న పోలీసులను కోరాడు.
ఊరికే తనను విసిగిస్తోందని, తన కిడ్డీ బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ కాజేస్తుందని ఫిర్యాదు చేశాడు.
జైళ్లో పెట్టకపోతే ఇక్కడి నుంచి కదలనని మారాం చేశాడు.
ఆ బుడతడి ఫిర్యాదుపై ఏం చేయాలో తెలియని పోలీసులు వెంటనే అతడి తండ్రిని స్టేషన్ కు పిలిపించారు.
అయితే నాలుగేళ్ల చిన్నారి ఏలాంటి భయం లేకుండా స్టేషన్ కు రావడంపై పోలీసులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
చిన్నపిల్లాడిని కాబట్టి తనను పోలీసులు ఏం చేయరని అందుకే ఒక్కడినే స్టేషన్ కు వచ్చానని చైతన్య అంటున్నాడు. నానమ్మను మాత్రం జైళ్లో పెట్టాల్సిందేనని చెబుతున్నాడు.
అయితే దీనిపై చైతన్య తండ్రి శివ మాట్లాడుతూ.. రాత్రి సడన్ గా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ కాల్ రావడంతో ఆశ్చర్యం వేసిందని తెలిపారు. పిల్లాడు చాలా షార్ప్ గా ఉన్నాడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తనకు సూచించారని చెప్పాడు.
పోలీస్ స్టేషన్ కు వెళ్లమని తానేం చెప్పలేదని, సీరియల్స్ లో చూసి ఇలా చేసి ఉండవచ్చు అని పేర్కొన్నాడు.
