బీజేపీలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్న మాజీ మంత్రి కృష్ణాయాదవ్ చివరి నిమిషంలో తన చేరికను వాయిదా వేసుకున్నారు. బీజేపీకి చెందిన అగ్రనేతలు ఆయన కోసం సమయం కేటాయించినా.. ముందుగా అనుకున్న సమయానికి వారు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో మాజీ మంత్రి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
బీజేపీలో చేరాలని అనుకున్న మాజీ మంత్రి కృష్ణాయాదవ్‌కు ఓ వింత అనుభవం ఎదురైంది. ఆయన పార్టీ చేరేందుకు అనుచరలు హైదరాబాద్ సిటీలోని అనేక చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాగే బీజేపీ ఆఫీసులో కూడా వాటిని కట్టారు. ర్యాలీ తీసేందుకు కూడా సిద్ధమయ్యారు. కానీ చివరి నిమిషంలో ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు అందుబాటులో లేకుండాపోయారు. దీంతో ఈ చేరికను ఆయన వాయిదా వేశారు.
వాస్తవానికి కృష్ణాయాదవ్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించారు. కానీ కొంత కాలం సీఎం కేసీఆర్ వెల్లడించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేదు. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో పార్టీ అగ్రనేతలతో చర్చించారు. పార్టీలో చేరే తేదీ, సమయం అన్నీ ఖరారు అయ్యాయి. దాని ప్రకారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బుధవారం పార్టీలో చేరాల్సి ఉంది.
శ్రీశైలంలో అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు దగ్ధం..
అయితే దీని కోసం మాజీ మంత్రి కృష్ణాయాదవ్ అనుచరులు సిటీలోని అనేక చోట్లతో పాటు బీజేపీ ఆఫీసులో ఫ్లెక్సీలు కట్టారు. అలాగే నాంపల్లిలో ఉన్న రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ వేదిక నుంచి భారీ ర్యాలీ తీయాలని నిర్ణయించుకున్నారు. దాని కోసం భారీగా జనాన్ని కూడా సమీకరించుకున్నారు. కానీ చివరి నిమిషాల్లో బీజేపీ అగ్రనేతలు స్పందించలేదు. ఇక చేసేదేమీ లేక ఈ చేరిక కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు మాజీ మంత్రి ప్రకటించారు.
కాగా.. కరీంనగర్ జిల్లాకు చెందిన చెన్నమనేని వికాస్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీలోకి బుధవారం చేరారు. ఆయనను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, అలాగే రాజ్యసభ సభ్యుడు లక్షణ్ లు బీజేపీలోకి ఆహ్వానించారు. అయితే కృష్ణాయాదవ్‌ను పార్టీలో చేర్చుకునేందుకు సమయం కేటాయించి, వీరంతా అందుబాటులో లేకుండాపోవడం ఇక్కడ కొసమెరుపు.
