హైదరాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం... ఐదేళ్ల చిన్నారితో సహా దంపతుల సజీవదహనం (వీడియో)
హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంటున్న వరుస అగ్నిప్రమాదాలు ప్రాణనష్టం, ఆస్తినష్టాన్ని మిగిలిస్తున్నాయి. తాజాగా కుషాయిగూడలోని ఓ టింబర్ డిపోలో మంటలు చెలరేగి ముగ్గురు సజీవ దహనం అయ్యారు.
హైదరాబాద్ : వరుసగా చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు హైదరాబాద్ అలజడి సృష్టిస్తున్నాయి. గతంలో సికింద్రాబాద్ టింబర్ డిపో, ఇటీవల డెక్కన్ స్టోర్, స్వప్న లోక్ కాంప్లెక్స్ లో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదాలు మారణహోమం సృష్టించాయి. ఈ ప్రమాదాల గురించి మరిచిపోకముందే నగరంలో మరోసారి మంటలు చెలరేగి ఐదేళ్ల చిన్నారి సహా దంపతులు సజీవదహనం అయ్యారు.
యాదాద్రి భువనగిర జిల్లా తుంగతుర్తికి చెందిన నరేష్(35), సుమ(28) దంపతలకు ఇద్దరు కొడుకులు సంతానం. ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వచ్చిన నరేష్ భార్యా బిడ్డలతో కలిసి హైదరాబాద్ శివారులోకి కుషాయిగూడలో నివాసముండేవాడు. ఓ టింబర్ డిపో పక్కన వున్న ఇంట్లో ఈ కుటుంబం నివాసముండేది.
అయితే ఆదివారం తెల్లవారుజామున టింబర్ డిపోలో మంటలు చెలరేగి చుట్టుపక్కల ఇళ్లకు వ్యాపించాయి. ఇలా నరేష్ కుటుంబం నివాసముంటున్న ఇంటిని కూడా మంటలు చుట్టుముట్టాయి. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటల నుండి తప్పించుకోవడం సాధ్యం కాక నరేష్ దంపతులతో పాటు చిన్న కొడుకు జోషిత్(5) సజీవ దహనం అయ్యాడు. వీరి పెద్దకొడుకు ఆచూకీ తెలియాల్సి వుంది.
Read More చీమలపాడులో మరో విషాదం : పశువులకు అస్వస్థత, ఒకటి మృతి.. బీఆర్ఎస్ సమావేశం నాటి భోజనం వల్లే
టింబర్ డిపోలో మంటలను గుర్తించిన చుట్టుపక్కల ఇళ్లవారు వెంటనే బయటకు పరుగు తీయడంతో పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఇళ్లతో పాటు దగ్గర్లోని నాలుగు షాపులకు మంటలు అంటుకుని పూర్తిగా దగ్దమయ్యాయి. ఇలా ఈ అగ్ని ప్రమాదం ప్రాణ నష్టాన్నే కాదు భారీ ఆస్తినష్టాన్ని కలిగించింది.
అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. టింబర్ డిపోతో పాటు చుట్టుపక్కల ఇళ్లు, షాపులకు వ్యాపించిన మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కానీ అప్పటికే మంటల్లో మనుషులు, ఆస్తులు దహనమై జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
వీడియో
కుషాయిగూడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పటల్ కు తరలించారు. తల్లిదండ్రులతో పాటే ఓ చిన్నారి దహనంకాగా మరో చిన్నారి ఏమయ్యాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు.
ఇదిలావుంటే గత ఏడాది మార్చి నుండి ఇప్పటివరకు హైద్రాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో 32 మంది మృతి చెందినట్లు సమాచారం. నగరంలో జరిగిన అగ్ని ప్రమాదాల్లో ఎక్కువగా సికింద్రాబాద్ పరిధిలోనే జరిగినవే. జనావాసాల మద్య వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడమే అగ్ని ప్రమాదాల్లో ప్రాణనష్టానికి కారణం అవుతోంది.
2022 మార్చి 23న సికింద్రాబాద్ బోయిగూడ లో గల తుక్కు గోడౌన్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ గోడౌన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోడౌన్ పై అంతస్థులో నిద్రపోయిన కార్మికులు నిద్రలోనే మృత్యువాత పడ్డారు.
2022 సెప్టెంబర్ 12న సికింద్రాబాద్ రూబీ లాడ్జిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. ఈ ఏడాది జనవరి 29వ తేదీన సికింద్రాబాద్ డెక్కన్ మాల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. తాజాగా కుషాయిగూడలో మరో ముగ్గురు మృతిచెందారు.
హైద్రాబాద్ , సికింద్రాబాద్ లలో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న సమయాల్లో అధికారులు హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.