చీమలపాడులో మరో విషాదం : పశువులకు అస్వస్థత, ఒకటి మృతి.. బీఆర్ఎస్ సమావేశం నాటి భోజనం వల్లే
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో ముగ్గురు మరణించిన ఘటన మరిచిపోకముందే అదే ఘటనాస్థలిలో మరో విషాదం చోటు చేసుకుంది.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో ముగ్గురు మరణించిన ఘటన మరిచిపోకముందే అదే ఘటనాస్థలిలో మరో విషాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఆరోజున బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో నేతలు, కార్యకర్తల కోసం నిర్వాహకులు భారీగా భోజన వసతిని ఏర్పాటు చేశారు. దీంతో అదే రోజున ఆహార పదార్ధాలను సమావేశం ఏర్పాటు చేసిన ప్రదేశంలో పడేశారు బీఆర్ఎస్ నేతలు. ఈ ఆహార పదార్థలను తిని ఒక పశువు మరణించగా.. మరికొన్ని కూడా తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములుతో పాటు పలువురు పార్టీ నేతలు చీమలపాడుకు విచ్చేశారు. పార్టీ నేతల రాక సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా పేల్చారు. అయితే ప్రమాదవశాత్తు బాణసంచా నిప్పురవ్వలు పడి సమీపంలోని గుడిసెలో వున్న గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఎనిమిది మంది వరకు గాయపడగా.. ఘటనాస్థలంలో ఒకరు, ఆసుపత్రిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సిలిండర్ పేలుడు ధాటికి పలువురి కాళ్లు, చేతులు తెగిపడి ఆ ప్రాంతమంతా హృదయ విదారకరంగా మారింది.
ALso Read: చీమలపాడు దుర్ఘటన: కుట్ర కోణంపై పోలీసుల విచారణ.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
మరోవైపు.. అగ్నిప్రమాద ఘటనలో బాధితుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల ఆర్ధిక సాయంతో పాటు ఉచితంగా వైద్యం అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.