హాట్ టాపిక్ గా మారిన కొడంగల్ ఉప ఎన్నిక వ్యవహారం ఉప ఎన్నికలొస్తే రేవంత్ గెలుపు నల్లేరు మీద నడకే నా? కొడంగల్ తెలంగాణ నంద్యాల గా మారుతుందా?
ఇలా రాజీనామా చేసి అలా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారో లేదో అప్పుడే రేవంత్ రెడ్డి అభిమానుకులకు ఒక శుభవార్త అందింది. రేవంత్ రెడ్డికి కొడంగల్ లో ఎదురే లేదన్న వాతావరణం నెలకొంది. ఇంతకూ రేవంత్ అభిమానులకు అందిన శుభవార్త ఏంటిదబ్బా అనుకుంటున్నారా? రేవంత్ కు ఎదురే లేని పరిస్థితి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మొత్తం చదవురి మని.
అది ఉమ్మడి రాష్ట్రంలోని పాలనాకాలం.. తెలంగాణ పది జిల్లాల్లో పాలమూరు అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉంది. ఆ వెనుకబడిన పాలమూరు ప్రాంతంలో కొడంగల్ మరింత వెనుకబడిన ఏరియా. అక్కడ అక్షరాస్యత మొదలు ఆర్థిక పరమైన అభివృద్ధి అంతంతమాత్రమే. ఆసమయంలో కొడంగల్ అనగానే రాజకీయ వర్గాలకు ఠక్కున గుర్తొచ్చేది గుర్నాథ్ రెడ్డి. కొడంగల్ అంటే గుర్నాథ్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి అంటే కొడంగల్ అనే వాతావరణం ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు ఒక్క కొడంగల్ నియోజకవర్గంలోనే 10సార్లు పోటీ చేశారు. కొన్నిసార్లు గెలిచారు. కొన్నిసార్లు ఓడిపోయారు అది వేరే విషయం అయయినప్పటికీ, అంత సుదీర్ఘ కాలం గుర్నాథ్ రెడ్డి కొడంగల్ రాజకీయాలు శాసించారు.

ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీకి దిగిండో అప్పటి నుంచి గుర్నాథ్ రెడ్డి ప్రతిష్ట మసకబారుతూ వచ్చింది. వరుసగా 2009, 2014 ఎన్నికల్లో కొడంగల్ లో వరుసగా యువకుడైన రేవంత్ మీద గుర్నథ్ రెడ్డి ఓడిపోతూ వచ్చారు. ఇప్పుడు కొడంగల్ ఎమ్మెల్యే పదవికి సైతం రేవంత్ రాజీనామా ఇచ్చిండు. ఈ నేపథ్యంలో కొడంగల్ ఉప ఎన్నిక ఖాయంగా కనబడుతున్నది. ఒకవేళ కొడంగల్ ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ ఖాయం. మరి టిఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది.

కొడంగల్ ఉప ఎన్నిక వస్తే తాను పోటీకి దూరంగా ఉంటున్నట్లు కొడంగల్ గుర్నాథ్ రెడ్డి ప్రకటించారు. ‘నేను ఈసారి కొడంగల్ లో జరిగే ఉప ఎన్నికకు అర్హుడిని కాను.. నా వయసు 75 దాటింది. నా పనులు నేను సరిగా చేసుకోలేను. ఈ వయసులో పోటీ చేయలేను.. ఒకవేళ టిఆర్ఎస్ అధిష్టానం ఒప్పుకుంటే నా కొడుకును పోటీ చేయిస్తా’ అని గుర్నాథ్ రెడ్డి వెల్లడించారు. ఈ పరిణామం రేవంత్ రెడ్డి అభిమానులకు గొప్ప సంబరంగా చెప్పుకునే వాతావరణం ఉంది. అయితే గుర్నాథ్ రెడ్డి మరో విషయం కూడా వెల్లడించారు. కొడంగల్ ఉప ఎన్నిక మరో నంద్యాల ఎన్నికను తలపిస్తుందని, డబ్బుల వరద పారుతుందని స్పష్టం చేశారు. అయితే ఎన్నికలు అంటూ జరిగితే రేవంత్ రెడ్డికి, టిఆర్ఎస్ అభ్యర్థికి మధ్య గట్టి పోటీ ఉంటుందన్నారు.

మొత్తానికి కొడంగల్ లో దశాబ్దాలుగా చక్రం తిప్పి గట్టి పట్టున్న నేతగా పేరు తెచ్చుకున్న రేవంత్ తొలి ప్రత్యర్థి గుర్నాథ్ రెడ్డి ఎన్నికల బరిలో నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవడం రేవంత్ రెడ్డి అభిమానులకు తీపి కబురుగానే చెబుతున్నారు. అంతటి నాయకుడే పోటీకి దిగకపోతే మిగతావాళ్లు ఎందరొచ్చినా రేవంత్ కు ఎదురే లేదని ఆయన అభిమానులు అంటున్నారు. కారణాలేమైనా గుర్నాథ్ రెడ్డి పోటీ నుంచి తప్పుకోవడమంటే రేవంత్ రెడ్డి గెలుపు నల్లేరు మీద నడక లాంటిదేనని రేవంత్ అభిమానులు చెబుతున్నారు.
