హైదరాబాద్ లో అగ్నిప్రమాదం.. ఆటోనగర్ డీర్ పార్క్ వద్ద తగలబడ్డ లారీ, ఎగిసిపడుతున్న మంటలు, భారీగా ట్రాఫిక్ జాం..
హైదరాబాద్ శివార్లలో ఓ లారీలో మంటలు చెలరేగి తగలబడి పోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివార్లలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వనస్థలిపురం ఆటోనగర్ లో పెను ప్రమాదం తృటిలో తప్పింది. హైదరాబాద్, ఆటో నగర్ పార్క్ సమీపంలోని జాతీయ రహదారిపై ఓ లారీలో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి లారీ పూర్తిగా దగ్ధమయ్యింది. ఈ ప్రమాదంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఇరువైపులా భారీగా వాహానాలు నిలిచిపోయింది. గంటల తరబడి ట్రాఫిక్ జాం ఏర్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. జెసిబి సహాయంతో ప్రమాదానికి గురైన లారీని పక్కకు తొలగించారు. ప్రమాద స్థలికి ఎటువైపు ఉన్న వాహనాలను.. అటువైపే మళ్ళించి ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది తెలియరాలేదు.
కాగా అటు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోనూ ఇలాంటి పెనుప్రమాదమే తప్పింది. సత్తుపల్లిలోని ఓ పెట్రోల్ బంక్ దగ్గర బైక్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. బైక్ లో పెట్రోల్ కొట్టించిన వెంటనే బండిలో నుంచి ఉన్నట్టుండి మంటలు .దాంతో స్థానికులు, వాహనదారులు, పెట్రోల్ బంకు సిబ్బంది సైతం భయంతో పరుగులు తీశారు. కొంతమంది యువకులు బైక్ ను వెంటనే పక్కకు తీసి మంటలను అదుపు చేశారు. తక్షణమే స్పందించిన యువకులు చాకచక్యంగా వ్యవహరించి మంటలను అదుపు చేశారు. లేదంటే పెట్రోల్ బంక్ లో మంటలు అంటుకుంటే.. పెను ప్రమాదం సంభవించేది. అయితే, మంటలు వ్యాపించిన క్షణాల్లోనే మంటలు ఆరిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఢిల్లీలో మళ్లీ ఫైర్ యాక్సిడెంట్.. మండవాలి పోలీస్ స్టేషన్‌లో చెలరేగిన మంటలు
ఇదిలా ఉండగా, శనివారం ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమలో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లీ కూతుళ్లు అగ్ని ప్రమాదంలో సజీవదహనం అయ్యారు. ఈ ఘటన అల్లవరం మండల కొమ్మరగిరిపట్నం ఆకులవారి వీధిలో జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న తల్లికూరుర్లు సజీవదహనం అయ్యారు. వీరిని సాధనాల మంగాదేవి (40),మెడిశెట్టి జ్యోతి (23)గా గుర్తించారు.
మరో విషాదం ఏమిటంటే మెడిశెట్టి జ్యోతి ఇప్పుడు గర్భవతి. తల్లిగారింటికి వచ్చింది. ఈమె ఐదు నెలల కిందట లవ్ మ్యారేజ్ చేసుకుంది. పెద్దలను కాదని తానిష్టపడ్డ వ్యక్తిని పెళ్లిచేసుకోవడం, గర్భవతి కావడంతో.. ఈ అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కూతురిని, అడ్డువచ్చిన తల్లిని హత్య చేసి ఇల్లు తగలబెట్టారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన అల్లవరం పోలీసులు.. కేసును దర్యాప్తు చేస్తున్నారు.