Asianet News TeluguAsianet News Telugu

అన్నదమ్ముల భూతగాదా... పొలం గట్టుపైనే గొడ్డళ్లతో నరుక్కున్న తండ్రులు, పిల్లలు

వ్యవసాయ భూమి సరిహద్దుల విషయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ రక్తపాతం సృష్టించింది.   

Fight Between Brothers Over Land Dispute in Yadadri District AKP
Author
First Published Jun 8, 2023, 12:41 PM IST

భువనగిరి : ఇద్దరు అన్నదమ్ముల మధ్య గట్టు పంచాయితీ చిచ్చుపెట్టింది. పెద్దల ఆస్తిని పంచుకున్న సోదరుల మధ్య భూతగాదా నెలకొంది. దీంతో రక్తసంబంధాన్ని మరిచిన సోదరులు ఒకరిని ఒకరు గొడ్డళ్లతో నరుక్కున్నారు. వారి బిడ్డలు తండ్రుల మాదిరిగానే గొడ్డళ్ళతో పరస్పర దాడులకు దిగారు. ఇలా అన్నదమ్ములు, వారి పిల్లలు పరస్పరం దాడులకు తెగబడి రక్తపాతం సృష్టించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. 

పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం మానాయికుంటకు చెందిన లచ్చమ్మ, బుచ్చయ్య దంపతులకు వీరయ్య, సైదులు కొడుకులు. ఇద్దరు కొడుకులకు చెరో రెండెకరాల భూమిని తండ్రి పంచిఇచ్చాడు. అయితే ఈ భూమి గట్టు విషయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య వివాదం తలెత్తింది.ఇదికాస్తా పెరిగి పెద్దదై రక్తసంబంధాన్ని మరిచి ఒకరినొకరు చంపుకునే స్థాయికి చేరుకుంది.  

అన్నదమ్ముల మధ్య గట్టుపంచాయితీ బుధవారం తారాస్థాయికి చేరుకుంది. అన్న వీరయ్య కొడుకు ప్రభాస్ తో కలిసి పొలం దున్నుతున్నట్లు తెలుసుకున్న సోదరుడు సైదులు తన కొడుకు శేఖర్ తో కలిసి పొలానికి వెళ్ళాడు. దీంతో నలుగురి మధ్య మరోసారి భూమి సరిహద్దుల విషయంలో గొడవ జరిగింది. కోపంలో విచక్షణ కోల్పోయిన వీరు ఒకరిపై ఒకరు గొడ్డళ్లతో దాడులకు దిగి ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు. 

Read More  పచ్చని సంసారంలో మద్యం చిచ్చు... 24గంటల్లోపే భార్యాభర్తల సూసైడ్

యువకులు శేఖర్, ప్రభాస్ మధ్య మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో వారి తండ్రులు వీరయ్య, సైదులు కూడా కొట్టుకున్నారు. ఇలా నలుగురు ఒకరిపై ఒకరు గొడ్డళ్లతో నరుక్కున్నారు. దీంతో సైదులు చేయి తెగిపడగా మిగతా ముగ్గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. చుట్టుపక్కల పొలాల రైతులు అన్నదమ్ములను అడ్డుకున్నారు. అప్పటికే అన్నదమ్ములు, వారి పిల్లల శరీరాలు గాయాలతో రక్తసిక్తం అయ్యాయి. 

ఈ భూవివాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో పడివున్నవారికి ప్రథమ చికిత్స చేయించి వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం గొడ్డళ్ల దాడిలో గాయపడిన నలుగురికీ ఎలాంటి ప్రాణహాని లేదని డాక్టర్లు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios