దేశవ్యాప్తంగా అత్యంత వేగంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ధాటికి భారతీయులు ఆందోళనకు గురవుతున్నారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ వేగంగా విస్తరిస్తోంది.

ఈ క్రమంలో తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఐదుకు చేరుకుంది.

Also Read:కరోనా కలకలం... ఫీవర్ ఆస్పత్రిలో 14మంది అనుమానితులు

మంగళవారం కోఠిలోని కమాండ్ కంట్రోల్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి ఈటల.. కరోనా వైరస్ కట్టడికి నిరంతరం పనిచేస్తున్నామని తెలిపారు. ఇకపై ప్రతిరోజూ 3 సార్లు కరోనా బులెటిన్ విడుదల చేస్తామని, ఇప్పటివరకు తెలంగాణ వారికి కరోనా సోకలేదని ఈటల స్పష్టం చేశారు.

కేవలం విదేశాలకు వెళ్లొచ్చిన వారికి మాత్రమే కరోనా సోకిందన్న ఆయన దుబాయ్, ఇటలీ, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, ఇండోనేషియా  నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా సోకిందన్నారు. రేపటి నుంచి యూఏఈ దేశాల నుంచి వచ్చే విమానాలను రద్దు చేశామని, విదేశీయులకు క్వారంటైన్ ఏర్పాటు చేస్తున్నామని రాజేందర్ చెప్పారు.

Also Read:కరోనాపై అతిగాళ్లు అతి చేస్తున్నారు: మీడియాకు కేసీఆర్ వార్నింగ్

కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే వాళ్లకు 14 రోజుల పాటు క్వారంటైన్ చేయాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. ఇదే సమయంలో క్వారంటైన్‌లో ఉన్న వాళ్లు రోగులు కాదని, 221 మందిని ప్రస్తుతం క్వారంటైన్‌లో పెట్టామని ఈటల వెల్లడించారు. 

దేశంలో తొలుత థర్మల్ స్క్రీనింగ్ మొదలుపెట్టిన రాష్ట్రం తెలంగాయేనన్నారు. సొంతంగా స్క్రీనింగ్ మెషిన్లు కొనుగోలు చేసి 200 మంది వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సాయంతో 66,182 మందిని విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ చేశామని మంత్రి తెలిపారు. వీరిలో 464 మంది అనుమానితుల రక్త నమూనాలను ల్యాబ్‌కు పంపగా వీరిలో 5 పాజిటివ్ కేసులు బయటపడ్డాయని ఈటల వివరించారు.

విమానాశ్రయాల్లో విదేశీయులను కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించామని మంత్రి గుర్తుచేశారు. ఆఫ్ఘనిస్తాన్, మలేషియా, ఫిలిప్పిన్స్, యూకే నుంచి వచ్చే విమానాలను హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రాకుండా నిషేధించామని ఈటల చెప్పారు. వైరస్ లేని వాళ్లను 14 రోజుల పాటు వీరిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించామని రాజేందర్ వెల్లడించారు.

రాష్ట్రంలో వెలుగుచూసిన తొలి కరోనా బాధితుడు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పూర్తి చేసుకుని డిశ్చార్జ్ అయ్యారని మంత్రి తెలిపారు. కరోనా పాజిటివ్‌గా తేలిన వారు ఎక్కడెక్కడ తిరిగారో, ఎవరిని కలిశారో తెలుసుకుని పరిశీలనకు పంపుతున్నామని ఈటల వెల్లడించారు.

తెలంగాణలో కరోనా వైరస్ టెస్టుల కోసం ఆరు ల్యాబ్‌లను పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకున్నామని.. ఇప్పటి వరకు వ్యాధి నిర్థారణ కోసం పూణేకు పంపేవారమని, అయితే ఇది ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేసుకున్నామని రాజేందర్ పేర్కొన్నారు. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వచ్చే వారికి సైతం పరీక్షలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

ఐసోలేషన్ వార్డులు వద్దంటూ ప్రజలు ధర్నాలు చేస్తున్నారని.. అయితే వీరు రోగులు కాదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. విదేశాల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులను భారతదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని ఈటల చెప్పారు.