ఇంట్లోకి చొరబడ్డ విషసర్పం కాటేయడంతో తండ్రీకొడుకులు మృతిచెందిన విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

కామారెడ్డి : అత్యాధునిక వైద్యం అందుబాటులో వున్నా ఇప్పటికీ కొన్ని పల్లెల్లో పసరుమందులే వాడుతుంటారు. ఇలా పాముకాటుకు గురయిన తండ్రీకొడుకు పసరుమందు వాడి ప్రాణాలు కోల్పోయిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కేవలం గంగల వ్యవధిలోని తండ్రీకొడుకు మృతిచెందడం ఆ కుటుబంలో తీరని విషాదాన్ని నింపింది. 

వివరాల్లోకి వెళితే... కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం శేర్ శంకర్ తండాకు చెందిన రవి(41), మంగిలి దంపతులు వ్యవసాయ కూలీలు. కొడుకు వినోద్ తో కలిసి రాత్రి ఇంట్లోని అరుగుమీద పడుకున్నారు దంపతులు. అయితే వీరి ఇంట్లోకి చొరబడిన పాము తల్లిదండ్రుల వద్ద పడుకున్న వినోద్ ను కాటేసింది. వెంటనే నిద్రలేచిన వినోద్ పామును చూసి గట్టిగా అరవడంతో తల్లిదండ్రులు కూడా లేచారు. కొడుకును కాటేసిన పామును వెంబడించి చంపేందుకు ప్రయత్నించాడు రవి. ఈ క్రమంలోనే పాము అతడిని కూడా కాటేసింది. 

ఇలా పాముకాటుకు గురయిన తండ్రీకొడుకు హాస్పిటల్ కు వెళ్లకుండా నాటువైద్యాన్ని నమ్ముకున్నారు. స్థానికంగా దొరికే ఆకుపసరు వేసుకున్నా అది వారిని కాపాడలేకపోయింది. ఆకుపసరు తాగిన కొద్దిసేపటికే వినోద్ నొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకున్నాడు. ఇలా నిమిష నిమిషానికి అతడి పరిస్థితి విషమించి అరగంటలోనే ప్రాణాలు కోల్పోయాడు. 

Read More గర్భిణిని బంధించి రూ.10 లక్షలు చోరీ చేసిన దొంగ.. జైలుకు వెళ్లి వచ్చి, డిప్రెషన్ తో ఆత్మహత్య..

కొడుకు చనిపోయిన బాధలో రోదిస్తున్న రవి కూడా కొద్దిసేపటి తరువాత కళ్లుతిరుగుతున్నాయని చెప్పాడు. మెళ్లిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతున్న అతడిని కుటుంబసభ్యులు 108 అంబులెన్స్ లో కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించినా అప్పటికే పరిస్థితి విషమించడంలో రవి ప్రాణాలు కోల్పోయాడు. 

కేవలం గంటల వ్యవధిలో తండ్రీకొడుకు మృతిచెందడంతో శేర్ శంకర్ తండాలో విషాదం నెలకొంది కట్టుకున్న కొడుకు, కన్నకకొడుకు మృతదేహాల వద్ద మంగిలి రోదించడం అక్కడున్న అందరితో కన్నీరు పెట్టిస్తోంది. నాటువైద్యాన్ని నమ్ముకోకుండా పాముకాటు వేసిన వెంటనే హాస్పిటల్ కు వెళితే తండ్రీకొడుకు ప్రాణాలు దక్కేవని తండా వాసులు అంటున్నారు.