కరీంనగర్: పెద్దపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రెవెన్యూ అధికారులు తన సొంత భూమిని ఎక్కడ తనకు కాకుండా చేస్తారో అన్న మనస్ధాపంలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటన మండల ఎమ్మార్వో కార్యాలయం ఎదుటే చోటుచేసుకోవడం మరింత బాధాకరం. 

ఈ ఆత్మహత్యకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం రెడ్డిపల్లికి చెందిన మందల రాజిరెడ్డికి ఎకరం 20 గుంటల వ్యవసాయ భూమి వుంది. అయితే ఈ  భూమికి సంబంధించిన పత్రాల కోసం అతడు గతకొంత కాలంగా శ్రీరాంపూర్ లోని తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. 

read more  ఫలితాల ఎఫెక్ట్: తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు

అయితే రెవెన్యూ అధికారులు అతడి పని చేయకుండా తాత్సారం చేస్తున్నారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయిన అతడు శనివారం అదే తహశీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భూమిని తన పేరు మీద నమోదు చేయడం లేదని... తహశీల్దార్ వేణుగోపాల్, వీఆర్వో గురు మూర్తి, స్వామి లే తన ఆత్మహత్యకు కారకులంటూ సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

ఈ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఆత్మహత్య కారణంగా ఎలాంటి అలజడి చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా శ్రీరాంపూర్ తహశీల్దార్ కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.