హైదరాబాద్: పరీక్షా ఫలితాలు వెల్లడైన తర్వాత తీవ్ర మనస్తాపానకి గురై తెలంగాణలో ఐదుగురు ఇంటర్మీడిట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని కొందరు, ఫెయిల్ అయ్యామని మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 

మహబూబాబాద్ జిల్లాకు చెందిన సరయూ అనే విద్యార్థిని బావిలో దూకి మరణించింది. వికారాబాద్ జిల్లాకు చెందిన నిఖిత ఉరేసుకుని మృతి చెందింది. నాగర్ కర్నూలు కు చెందిన సోని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గజ్వెల్ కు చెందిన శ్రావణి, నిర్మల్ జిల్లాకు చెందిన ప్రణయ్ ఆత్మహత్యలు చేసుకున్నారు.

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం విడుదల చేసిన విషయం తెలిసిందే. మేడ్చెల్, ఆసిఫాబాద్ జిల్లాలో పరీక్షా ఫలితాల్లో టాప్ లో నిలిచాయి.  

గిరిజన జాతికి చెందిన 16 ఏళ్ల సరయు బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చెందుగూడెంలో ఈ సంఘటన జరిగింది. సరయు గిరిజన సంక్షేమ జూనియర్ కళాశాలలో చదువుకుంది. ఆమె పరీక్షల్లో ఫెయిల్ అయింది. తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పడానికి తీవ్రంగానే ప్రయత్నించారు. 

శుక్రవారం ఉదయం 6 గంటలకు ఆమె కనిపించకుండా పోయింది. ఆ విషయాన్ని తల్లి కుమారుడికి చెప్పి, చెల్లె కోసం వెతకాలని చెప్పింది. టెర్రాస్ నుంచి చూస్తే తన సోదరి ఇంటి వెనక ఉన్న బావి వైపు నడుస్తూ కనిపించింది. అతను చేరుకునే లోగానే ఆమె బావిలోకి దూకింది. ఈత రాకపోవడంతో ఆమెను కాపాడడంలో అతను విఫలమయ్యాడు.