Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎస్ ఆఫీసర్, ఆర్మీ కర్నల్, మేజర్.. నంటూ మోసాలు.. నకిలీ పోలీస్ అరెస్ట్..

ఐపీఎస్ ఆఫీసర్, ఆర్మీ కర్నల్, మేజర్ వేషాల్లో మోసాలకు పాల్పడుతూ.. డబ్బులు దోచుకుంటున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పూటకో వేషం మారుస్తూ... ఘరానా మోసాలకు పాల్పడుతున్నాడీ కేటుగాడు. 

fake police arrested in hydeabad - bsb
Author
First Published May 25, 2023, 10:34 AM IST

హైదరాబాద్ :  ఐపీఎస్ అధికారి పేరుతో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడిని సైబరాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఐపీఎస్ అధికారి, ఆర్మీ కర్నల్, మేజర్.. ఇలా రకరకాల మారువేషాలతో మోసాలకు పాల్పడుతున్నాడు ఈ  కేటుగాడు. అతని దగ్గర నుంచి పోలీసులు ఓ నాటు తుపాకీ, 9 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అతను వేస్తున్న వేషాలకు తగ్గట్టుగా తయారుచేసిన నకిలీ గుర్తింపు కార్డులను కూడా పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ  పోలీస్ అధికారి గుట్టును శంషాబాద్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ బృందం, మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా రట్టు చేశారు. 

బుధవారం దీనికి సంబంధించిన  వివరాలను.. మాదాపూర్ డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. వీరు తెలిపిన వివరాల ప్రకారం… నిందితుడు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఎస్. చిక్కాలకు చెందిన నాగరాజు కార్తీక్ రఘువర్మ అలియాస్ కార్తీక్ (25). నాగరాజు డిగ్రీ వరకు చదువుకున్నాడు. పోలీసు అధికారి కావాలని ఆశపడ్డాడు. దీంట్లో భాగంగానే కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు రాశాడు. కానీ,  విజయం సాధించలేకపోయాడు. 

ఆ తర్వాత లక్ష్యాన్ని మరిచిపోయి జల్సాలకు అలవాటు పడ్డాడు. తేలికగా డబ్బులు సంపాదించాలని  పథకాలు వేశాడు. దీనికోసం నకిలీ పోలీసు అవతారం ఎత్తాడు. స్పెషల్ ఆపరేషన్ టీం ఆఫీసర్, ఐపీఎస్ అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటూ నకిలీ అధికారుల వేషంలో  బెదిరింపులకు పాల్పడేవాడు. అలా ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే మే 15వ తేదీన హైదరాబాదులోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఓ హోటల్లో ఐపీఎస్ అధికారిని అంటూ దిగాడు.

అక్కడ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మహేష్తో పరిచయం ఏర్పడింది.  అతనితో తాను ఎస్ఓటి ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నట్లు నమ్మించాడు. కార్తీక్ చెప్పింది నమ్మిన మహేష్.. తన సమస్యను అతనికి చెప్పుకున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన తన సోదరుడు కుమార్.. ప్రసాద్ అనే వ్యక్తికి రూ.15 లక్షలు అప్పు ఇచ్చాడు.  అతను ఆ డబ్బులు తీసుకుని దుబాయ్ పారిపోయాడని.. ఈనెల 16వ తేదీన ప్రసాద్ దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్నాడని చెప్పాడు.

ఎలాగైనా ప్రసాద్ నుంచి తన  సోదరుడికి డబ్బులు ఇప్పించాలని నాగరాజును కోరాడు. దీనికి నాగరాజు తాను చూసుకుంటానని హామీ ఇచ్చాడు. ఎయిర్ పోర్టులోనే ప్రసాద్ ను అరెస్టు చేస్తానని.. వారికి రావాల్సిన డబ్బులు ఇప్పిస్తానని చెప్పాడు. అయితే, ఈ పని చేసినందుకు తనకు లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనికి ఒప్పుకున్న మహేష్ తన సోదరుడు  కుమార్ ను నాగరాజుకు పరిచయం చేశాడు. అడ్వాన్స్ కింద రూ. 30000 ఇచ్చారు. ఆ తర్వాతి రోజు నాగరాజు మహేష్ ని తీసుకుని అఫ్జల్ గంజ్ కు వెళ్లాడు.  అక్కడ మహేష్ తో  వాకిటాకీలు, బేడీలు కొనిపించాడు.  

మసాజ్ ముసుగులో వ్యభిచారం... బంజారాహిల్స్ స్పా సెంటర్లో గలీజ్ దందా

పోలీస్ ఆఫీసర్..ఇలా విడిగా కొనడం ఏమిటి అని మహేష్ కు అనుమానం వచ్చింది. దీంతో ఆ విషయాన్ని తన సోదరుడు కుమార్ కు చెప్పి.. నాగరాజు నకిలీ పోలీసు అధికారి అన్న అనుమానాన్ని వ్యక్తం చేశాడు. దీంతో, కుమార్  నాగరాజును తన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కానీ, నాగరాజు దానికి ఒప్పుకోకుండా తుపాకీతో కుమార్ ని బెదిరించాడు. వెంటనే బాధితులిద్దరూ ఈనెల 21న మాదాపూర్ పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకొని విచారించారు. వారి విచారణలో నకిలీ పోలీస్ అధికారిగా నాగరాజు చేసిన  దొంగతనాలు, దోపిడీలు అనేకం వెలుగులోకి వచ్చాయి. అవి విని వారు కూడా షాక్ అయ్యారు.

నాగరాజు.. 2016 నుంచి ఈ మోసాలకు తెరలేపాడు. ఆ సంవత్సరం హైదరాబాదుకు వచ్చిన నాగరాజు 2017,  2018లలో.. వేరు వేరు చోట్ల కారు డ్రైవర్గా చేరి పని చేశాడు.  పనిచేసిన చోటే రెండు కార్లు దొంగతనం చేశాడు.  ఈ నేరంలో జైలుకు వెళ్లి.. వచ్చిన తర్వాత.. గచ్చిబౌలి అంజయ్యనగర్ లో ఉన్న ఎక్స్పర్ట్ సెక్యూరిటీ సర్వీస్ లో సెక్యూరిటీ సూపర్వైజర్ గా ఉద్యోగం సంపాదించాడు. ఇక్కడ పని చేస్తున్న సమయంలోనే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ బిక్కుదార్ దాస్ తో పరిచయం ఏర్పడింది. అతనితో క్లోజ్ గా ఉంటూ.. ఆర్మీ ఆఫీసర్స్ కు సంబంధించిన డ్రెస్ కోడ్, ర్యాంకులకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నాడు.  

ఆ తరువాత సికింద్రాబాద్లో ఆర్మీ దుస్తులు కొనుక్కున్నాడు. వాటిని వేసుకుని తన స్వగ్రామానికి వెళ్ళాడు. అక్కడ తను ఆర్మీ మేజర్ అంటూ అందరికీ పరిచయం చేసుకున్నాడు. ఆర్మీ శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి వారికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దర్యాప్తులో నాగరాజు నకిలీ మేజర్ అని తెలియడంతో అరెస్టు చేసి జైలుకు పంపారు.

పోలీసుల విచారణలో నాగరాజు తాను ఈ నేరాలు చేయడానికి కారణం..  తన తల్లిదండ్రుల కోసం రూ. రెండు కోట్ల విలువ చేసే విలాసమైతమైన ఇల్లు కట్టించాలనుకోవడమే అని చెప్పాడు.  2017 నుంచి అలా దోపిడీలు చేస్తున్న అతను ఇప్పటివరకు వేర్వేరు కేసుల్లో రూ.25లక్షలు  దోచుకున్నట్లు తేలింది. నాగరాజు తాను మోసాలకు పాల్పడే క్రమంలో 23 సిమ్ కార్డులు ఉపయోగించాడు. 

14 జిమెయిల్ అకౌంట్ లు  పోలీసుల పేరుతో సృష్టించాడు. వాటి ఆధారంగానే అందరిని నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. నాగరాజు క్రికెటర్ ధోని,  బిపిన్ రావత్ లతో దిగినట్లుగా ఫోటోలను మార్పింగ్ చేశాడు. ఇక ఆర్మీ,  పోలీసు అధికారులకు సంబంధించిన అనేక ర్యాంకులు.. విధుల గురించిన  సమాచారాన్ని, వాటి మీద అవగాహనను సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాడని తేలింది

Follow Us:
Download App:
  • android
  • ios