Asianet News TeluguAsianet News Telugu

బీఆర్ఎస్‌లో చేరిన ఒడిషా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్.. మహాన్ భారత్ నిర్మిద్దామన్న కేసీఆర్

ఒడిషా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్‌లోకి సాదరంగా ఆహ్వానించారు. దేశంలోని అన్ని వ‌ర్గాలు సంతోషంగా ఉండేలా ఒక మ‌హాన్ భార‌త్ నిర్మిద్దామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.  

Ex Odisha CM Giridhar Gamang joined in BRS party
Author
First Published Jan 27, 2023, 8:03 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు ఒడిషా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు హేమ గమాంగ్, జ‌య‌రాం పాంగీ, రామ‌చంద్ర హ‌న్ష్‌డా, బృందావ‌న్ మ‌జ్హీ, న‌బీన్ నంద‌, రాథా దాస్, భ‌గీర‌థి సేతి, మ‌య‌దార్ జేనా ఉన్నారు.  గమాంగ్ తొమ్మిదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎస్టీ లోక్‌సభ స్థానం కోరాపుట్ నుంచి అత్యథిక సార్లు ఎంపీగా గెలిచిన ఘనత ఆయన సొంతం. 1999లో ఒడిషా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి.. 292 రోజుల పాటు సీఎంగా పనిచేశారు. 2015లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు గమాంగ్. 

అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ మహా సంగ్రామంలో పాల్గొనేందుకు మనతో కలిసి వస్తున్నారని అన్నారు. దేశంలో అమెరికా, చైనాల కంటే ఎక్కువ సంపద వుందన్నారు. దేశ భవిష్యత్ కోసమే బీఆర్ఎస్ ఆవిర్భావించిందన్నారు. కానీ అమెరికా, చైనాలు అభివృద్ధిలో ఏ స్థాయిలో వున్నాయని కేసీఆర్ ప్రశ్నించారు. 75 ఏళ్ల తర్వాత కూడా దేశంలో తాగేందుకు మంచినీళ్లు ఇవ్వలేకపోతున్నామని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పూర్తి స్థాయిలో సాగునీరూ లేదని కేసీఆర్ అన్నారు. ఈ 75 ఏళ్లలో మనం ఏం సాధించినట్లనని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. జాతి, ధర్మం పేరు చెప్పి ఓట్లు అడిగినవారు గెలిచి ఏం చేస్తారని కేసీఆర్ నిలదీశారు. 

Also REad: నాందేడ్‌లో బీఆర్ఎస్ సభ .. కేసీఆర్‌తో ఛత్రపతి సాహూ మహారాజ్ మనవడి భేటీ

ఒడిషాలో ఎన్ని నదులు వున్నా.. ఇంకా కనీసం తాగునీరు లేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆందోళనలు చేయాల్సిన పరిస్ధితి ఎందుకొచ్చిందని కేసీఆర్ ప్రశ్నించారు. మహారాష్ట్రలో సంపద లేదా అన్నారు. రైతులు కూడా చట్టసభల్లోకి రావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవని .. వలసలు పోయిన వారు తిరిగి వస్తున్నారని కేసీఆర్ తెలిపారు. దేశంలో 24 గంటల కరెంట్ ఇవ్వడమే బీఆర్ఎస్ లక్ష్యమని సీఎం వెల్లడించారు. కేంద్రం బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రైతుబంధు అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

క‌రెంట్‌కు దేశంలో కొద‌వ లేదని.. 4 ల‌క్ష‌ల మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉందని కేసీఆర్ తెలిపారు. అన్ని ధ‌ర‌లు పెంచుకుంటూ పోవాలి.. జ‌నం జేబులు కొట్టేయాల‌నే యావలోనే కేంద్రం వుందని సీఎం దుయ్యబట్టారు. పేదోడి క‌డుపు కొట్టాలి.. ఉన్నోడి జేబులు నింపాలి.. దేశంలో న‌డుస్తున్న‌ది ఇదేనంటూ కేసీఆర్ చురకలంటించారు. దేశంలోని అన్ని వ‌ర్గాలు సంతోషంగా ఉండేలా ఒక మ‌హాన్ భార‌త్ నిర్మిద్దామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios