కుటుంబ పాలనపై ప్రధాని మోడీకి కౌంటరిచ్చారు బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయిన్‌పల్లి వినోద్. అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయెల్, ధర్మేంద్ర ప్రధాన్‌ల తండ్రులు బీజేపీలో ఒకప్పటి నాయకులేనని వినోద్ గుర్తుచేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనపై బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయిన్‌పల్లి వినోద్ మీడియాతో మాట్లాడుతూ.. మోడీకి జాతీయ రహదారులకు సంబంధంలేదన్నారు. వీటిని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారని వినోద్ తెలిపారు. తెలంగాణకు వచ్చి మోడీ ఏం ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కొత్తగా రైల్వే లైనులు లేవని.. మెడికల్ కాలేజీ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ప్రధానిపై మండిపడ్డారు. అభివృద్ధి పనుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ ఆలస్యం చేసిందని బోయిన్‌పల్లి వినోద్ నిలదీశారు.
కుటుంబ పాలన , వారసత్వం గురించి మోడీ మాట్లాడటం హాస్యాస్పదంగా వుందన్నారు. అమిత్ షా కొడుకు, రాజ్‌నాథ్ సింగ్‌ల కొడుకులు ఏం చేస్తున్నారని వినోద్ ప్రశ్నించారు. అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయెల్, ధర్మేంద్ర ప్రధాన్‌ల తండ్రులు బీజేపీలో ఒకప్పటి నాయకులేనని వినోద్ గుర్తుచేశారు. కేటీఆర్, కవితలు ఉద్యమంలో పనిచేశారని ఆయన తెలిపారు. మోడీ తొలి నుంచి తెలంగాణకు వ్యతిరేకమని.. సుష్మా స్వరాజ్ ఒక్కరే ఆనాడు తెలంగాణ కోసం నిలబడ్డారని వినోద్ అన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఏం చెబితే మోడీ అది మాట్లాడారని ఆయన ఎద్దేవా చేశారు. ఓడీఎఫ్‌లో తెలంగాణ నెంబర్ వన్ అన్న వినోద్.. ఈ విషయాన్ని మీ మంత్రులే స్వయంగా చెప్పారని దుయ్యబట్టారు.
ALso Read: కుటుంబ పాలన, అవినీతి వేర్వేరు కాదు: కెసిఆర్ కు ప్రధాని మోడీ చురకలు
దేశంలోనే అవినీతిమయ ప్రభుత్వాల్లో మొదటి నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాలేనని వినోద్ ఆరోపించారు. తాను ఎంపీగా వున్నప్పుడు కరీంనగర్ మీదుగా పలు జాతీయ రహదారులను ప్రతిపాదించానని.. కానీ వాటిలో వేటికీ ఆమోదం లభించలేదన్నారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఏం సాధించాడని వినోద్ ప్రశ్నించారు. ఎన్నికల సీజన్ వస్తే మోడీ బాగా తిరుగుతాడని.. రాబోయే రోజుల్లో కర్ణాటక, తెలంగాణల చుట్టూ తిరుగుతూనే వుంటారని బోయిన్‌పల్లి వినోద్ చురకలంటించారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి ఇప్పటికే ఎన్నో రైళ్లు వున్నాయని.. వందే భారత్ ద్వారా ఇప్పుడే కొత్తగా రైలు వేశామన్నట్లుగా బీజేపీ హడావుడి చేస్తోందని ఆయన మండిపడ్డారు.
