త్వరలో జరగనున్న తెలంగాణ ఎన్నికల బరిలో దిగుతానని స్పష్టం చేశారు బీఆర్ఎస్ నేత , మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.  మీ కోసమే రాజకీయ జీవితం తప్ప.. నాకు పాలిటిక్స్ అవసరం లేదని తుమ్మల స్పష్టం చేశారు.

త్వరలో జరగనున్న తెలంగాణ ఎన్నికల బరిలో దిగుతానని స్పష్టం చేశారు బీఆర్ఎస్ నేత , మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లాలోని తన స్వగ్రామం గొల్లగూడెంలో ఆయన శుక్రవారం అభిమానులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. రాజకీయాలకు స్వస్తి చెబుతానని సీఎం కేసీఆర్‌కు చెప్పానని అన్నారు . జిల్లాతో రాజకీయ అనుబంధాన్ని తెంచుకోవాలనుకుంటున్నానని పేర్కొన్నారు. మీ కోసమే రాజకీయ జీవితం తప్ప.. నాకు పాలిటిక్స్ అవసరం లేదని తుమ్మల స్పష్టం చేశారు. ఏం చేసినా ఖమ్మం జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేనని అన్నారు. 

Also Read: కాసేపట్లో కార్యకర్తలతో తుమ్మల నాగేశ్వరరావు భేటీ.. పార్టీ మార్పుపై కీలక నిర్ణయం..?

గోదావరి జలాలతో మీ పాదాలు కడిగేదాకా రాజకీయాల్లో వుంటానని తుమ్మల స్పష్టం చేశారు. తనకు పదవి అలంకారం, అహంకారం, ఆధిపత్యం కోసం కాదని నాగేశ్వరరావు అన్నారు. తనను మీ గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తారనే మీ ముందుకు వచ్చానని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తానని , జిల్లా ప్రజల కోసం బరిలో దిగుతానని తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఎక్కడా తలవంచేది లేదని.. తన శిరస్సు నరుక్కుంటా తప్ప, తన వల్ల ఎవరూ తలదించుకోవద్దని ఆయన వ్యాఖ్యానించారు. తనను తప్పించారని, కొందరు శునకానందం పొందుతున్నారని తుమ్మల నాగేశ్వరరావు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కానీ ఎక్కడా తలవంచేది లేదన్నారు.