బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో చోటు లభించకపోవడంతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. తుమ్మలతో కాంగ్రెస్, బీజేపీ నేతలు టచ్‌లోకి వెళ్లారు. ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో చోటు లభించకపోవడంతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. దీంతో భవిష్యత్తు కార్యాచరణపై ఆయన అభిమానులు, కార్యకర్తలతో వరుసపెట్టి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మంచి పట్టున్న నేత కావడంతో తుమ్మలతో కాంగ్రెస్, బీజేపీ నేతలు టచ్‌లోకి వెళ్లారు. ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అయితే తుమ్మల మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. తాజాగా శుక్రవారం భారీ కాన్వాయ్‌తో తన స్వగ్రామం గొల్లగూడెం చేరుకున్న తుమ్మల నాగేశ్వరరావు అభిమానులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ భేటీ అనంతరం పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మరోవైపు తుమ్మల కుమారుడు యుగంధర్ మీడియాతో మాట్లాడుతూ.. అనుచరులతో మాట్లాడి తుమ్మల నాగేశ్వరరావు భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారని చెప్పారు. పాలేరు నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించి సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయాలనేది తుమ్మల నాగేశ్వరరావు అభిమతమన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తైతే జిల్లాలోని 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించాలనే లక్ష్యంతో తుమ్మల ఉన్నారన్నారు. పాలేరు నుండే పోటీ చేయనున్నట్టుగా గతంలో తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించిన విషయాన్ని యుగంధర్ ప్రస్తావించారు. పాలేరు నుండి తుమ్మల నాగేశ్వరరావుకు టిక్కెట్టు ఇవ్వకపోవడంతో ఆయన అనుచరుల్లో అసంతృప్తి నెలకొందని యుగంధర్ చెప్పారు.

Also Read: ప్రజాభీష్టం మేరకు తుమ్మల నిర్ణయాలు: యుగంధర్

2018 ఎన్నికల్లో పాలేరు నుండి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. ఇదే స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించిన కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. అయితే తాజాగా బీఆర్ఎస్ ప్రకటించిన జాబితాలో పాలేరు నుండి కందాల ఉపేందర్ రెడ్డికే కేసీఆర్ టిక్కెట్టు కేటాయించారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుండి పోటీ చేయాలని తుమ్మల నాగేశ్వరరావు రంగం సిద్దం చేసుకున్నారు. అయితే ఈ సమయంలో బీఆర్ఎస్ టిక్కెట్టు దక్కపోవడంతో ఆయన షాక్ కు గురయ్యారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్, బీజేపీల నుండి తుమ్మల నాగేశ్వరరావుకు ఆహ్వానాలు అందాయి. అయితే తుమ్మల నాగేశ్వరరావు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.