మహబూబ్ నగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు మాజీమంత్రి డీకే అరుణ. ఆర్టీసీ కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ అనడానికి కేసీఆర్ కు అర్హత లేదని విమర్శించారు. సెల్ఫ్ డిస్మిస్ అనే పదం కేసీఆర్  కే వర్తిస్తుందని చెప్పుకొచ్చారు. 

ఆర్టీసీ కార్మికులకు సెల్ఫ్ డిస్మిస్ అనేది వర్తించదన్నారు డీకే అరుణ. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కారించాలంటూ చేస్తున్న సమ్మె కేసీఆర్ గుండెల్లో గుబులు పుట్టిస్తోందన్నారు. ఆర్టీసీ కార్మికులతో ఎందుకు చర్చలు జరపడం లేదో చెప్పాలని నిలదీశారు. 

ఆర్టీసీ కార్మికులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్నారు. వారి సమస్యలను పరిష్కరించవచ్చునని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సమ్మె కాస్త సకల జనుల సమ్మెగా మారబోతుందని హెచ్చరించారు. 

త్వరలో రాబోయే సకల జనుల సమ్మెలో కేసీఆర్ కొట్టుకుపోతారని డీకే అరుణ శాపనార్థాలు పెట్టారు. లక్షల కోట్లు అప్పులు తెచ్చుకున్నా ఆర్టీసీ అప్పులు మాత్రం చెల్లించలేకపోతున్నారా అంటూ మండిపడ్డారు. 

ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు ఎందుకు చెల్లించ లేదో వివరించాల్సిన అవసరం కేసీఆర్ కు  ఉందన్నారు. కేసీఆర్‌ అవినీతి బయటపడి జైలుకు పోయే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. 

ఆర్టీసీని పరిరక్షించాల్సిన ప్రభుత్వం, ఆర్టీసీ ఆస్తులను టీఆర్‌ఎస్‌ నాయకుల చేతుల్లో పెట్టి చోద్యం చూస్తోందని విమర్శించారు. హైకోర్టు తీర్పును సీఎం కేసీఆర్ గౌరవించి ఆర్టీసీ కార్మికులతో తక్షణమే చర్చలని డీకే అరుణ డిమాండ్ చేశారు. 

తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ 17 రోజులుగా ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు సూచించినప్పటికీ రాష్ట్రప్రభుత్వం మాత్రం పెడచెవిన పెడుతోంది. 

ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచే అవకాశమే లేదని తేల్చి చెప్తోంది. అటు ఆర్టీసీ కార్మికులు మాత్రం ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఆర్టటీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తమ అభిప్రాయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. 

ఈ వార్తలు కూడా చదవండి

RTC Strike: జీతాల చెల్లింపుపై చేతులెత్తేసిన కేసీఆర్ ప్రభుత్వం

ప్రగతి భవన్ ముట్టడి: పోలీసుల పద్మవ్యూహాన్ని ఛేదించిన రేవంత్, జగ్గారెడ్డి