Asianet News TeluguAsianet News Telugu

జనగామ ముత్తిరెడ్డికి ఎర్రబెల్లి పొగ

  • జనగామలో పోటీకి ఎర్రబెల్లి సై
  • ముత్తిరెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి
  • జిల్లా కేంద్ర ఎమ్మెల్యేగా పనిచేయాలని ఎర్రబెల్లి ఉత్సాహం 
Errabelli dayakar rao preparing to contest in jangaon

తెలంగాణలో అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యేల జాబితాలో తొలి వరుసలో నిలుస్తారు జనగామ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. ఆయన ఎమ్మెల్యే కాకముందు ఆయనచుట్టూ వివాదాలున్నాయి. ఎమ్మెల్యే అయిన తర్వాత మరింత వివాదాలు పెరిగాయి. తుదకు ఉస్మానియా యూనివర్శిటీ భూములను సైతం కొల్లగొట్టినట్లు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మీద బలమైన ఆరోపణలున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎడాపెడా ప్రభుత్వ భూములు కబ్జా చేసినట్లు ఆరోపణలు గుప్పమన్నాయి. అంతేకాదు ఆయన అవినీతిని ఏకంగా జనగామ తొలి జిల్లా కలెక్టర్ దేవసేన బట్టబయలు చేసిన విషయం కూడా తెలిసిందే. మరి ఇంతగా ముత్తిరెడ్డి మీద ఎందుకు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల క్రమమేంటి? జనగామలో ముత్తిరెడ్డి పొజిషన్ ఏంటి? సందుట్లో సడేమియా అన్నట్లు పాలకుర్తి ఎమ్మెల్యేగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ మీద ఎందుకు కన్నేసినట్లు? జనగామ జిల్లాలో అసలు ఏం జరుగుతున్నదో తెలియాలంటే ఈ స్టోరీ చదవండం కంటిన్యూ చేయండి.

జనగామ జిల్లా కేంద్ర ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు పాలకుర్తిలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఉవ్విళ్లూరుతున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంచి పట్టుంది. తెలంగాణవాదం బలంగా ఉన్న కాలంలోనూ ఎర్రబెల్లి టిడిపి తరుపున 2014 ఎన్నికల్లో గెలిచి రికార్డు నెలకొల్పారు. అయితే ఇప్పుడు పార్టీ ఫిరాయించి టిడిపి నుంచి టిఆర్ఎస్ లో చేరారు. ఈ పరిస్థితుల్లో కండ్లు మూసుకున్నా గెలుస్తడు అన్న పేరుంది. మరి ఇంతగా చాన్స్ ఉంటే జనగామకు ఎందుకు ఎర్రబెల్లి మకాం మారుస్తున్నారబ్బా అన్న ప్రచారం ఊపందుకున్నది.

జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేగా పనిచేయాలన్న కోరిక ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఉన్నట్లు ప్రచారంలో ఉంది. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేగా ఉంటే.. జిల్లా అంతటా చక్రం తిప్పొచ్చు అన్న భావనతోనే జనగామపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా గతంలో టిడిపితో ఉన్న కేడర్ అంతా ఇప్పుడు టిఆర్ఎస్ లో చేరిపోయింది. ఈ నేపథ్యంలో జనగామలో పోటీ చేసినా.. పాత టిడిపి కేడర్ అంతా తనకు పనిచేయడం ద్వారా సునాయాసంగా గెలుస్తానన్న ధీమాతో ఎర్రబెల్లి పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. పైగా జనగామలో కొత్త ఓటర్లను కూడా ఆకర్షించి తద్వారా టిఆర్ఎస్ ను బలోపేతం చేయడం కోసం ఈ ప్రయోగానికి సన్నద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు మీద పోటీ చేసి ఓడిపోయిన సుధాకర్ రావు రానున్న ఎన్నికల్లో తిరిగి మళ్లీ పోటీ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సుధాకర్ రావుకు చాన్స్ ఇచ్చే కోణం కూడా ఇందులో దాగి ఉన్నట్లు చెబుతున్నారు.

ఎప్పుడైతే ఎర్రబెల్లి జిల్లా కేంద్రానికి మారాలనుకున్నారో.. అప్పటి నుంచి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మీద విమర్శల వర్షం కురుస్తోందన్న ప్రచారం కూడా ఉంది. ఎర్రబెల్లి కన్నేసినప్పటినుంచే ముత్తిరెడ్డి అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు, కలెక్టర్ తో వివాదం, చెరువుల కబ్జాలు.. ఇవన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఈ పరిస్థితుల్లో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పై వ్యతిరేకత పెరిగిన కారణంగా ఆ స్థానంలో ఎర్రబెల్లిని బరిలోకి దించే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ఒకవేళ ముత్తిరెడ్డికి టికెట్ రాకపోతే ఆయన భవిష్యత్తు ఏమిటి? అనే విషయంలో కూడా రకరకాల చర్చలు మొదలయ్యాయి. అవసరమైతే.. ముత్తిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తారని, తర్వాత కేబినెట్ లో కూడా చాన్స్ ఇవ్వొచ్చని చెబుతున్నారు. ముత్తిరెడ్డి మీద భూకబ్జా ఆరోపణలు చేసిన జిల్లా కలెక్టర్ పై బదిలీ వేటు వేసిన నేపథ్యంలో ముత్తిరెడ్డిని ఏమాత్రం టిఆర్ఎస్ దూరం చేసుకోదన్న ప్రచారం ఉంది. మొత్తానికి ఎర్రబెల్లి దయాకర్ రావు మరో ప్రయోగానికి 2019లో సిద్ధపడుతున్న పరిస్థితి ఉందని టాక్ నడుస్తోంది.

కొసమెరుపు ఏమంటే.. ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామలో పోటీ చేయబోతున్నారంటూ టిడిపిలో ఎర్రబెల్లితో క్లోజ్ ప్రెండిప్ చేసిన ప్రస్తుత కాంగ్రెస్ నేతగా ఉన్న రేవంత్ రెడ్డి ధృవీకరించారు. ఇటీవల గాంధీభవన్ లో రేవంత్ మీడియాతో మాట్లాడుతూ మీరు చూస్తుండండి.. ఎర్రబెల్లి జనగామలో పోటీ చేస్తాడు అని స్పష్టం చేశారు రేవంత్. 

Follow Us:
Download App:
  • android
  • ios