సిసలైన తెలంగాణ భగీరథుడు ఈయనే (వీడియో)

Duscharla Satyanarayan real of Bhagiratha of Telangana
Highlights

  • నీటికోసం ఉద్యోగాన్ని త్యాగం చేసిన నల్లగొండ ఆణిముత్యం
  • ఫ్లోరైడ్ కష్టాలపై చలించిన దుశర్ల సత్యనారాయణ
  • సొరంగం తొవ్విపెట్టు... నల్లగొండకు బువ్వ పెట్టు అని నినదించిన మనిషి

అపర భగీరథుడు.. నేటి భగీరథుడు అని రాజకీయ నాయకులు తమకు తామే బిరుదులు ఇచ్చుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాలమిది. కానీ ఏ బిరుదులు ఇచ్చుకోకుండా.. నిజాయితీగా తెలంగాణలోని ఫ్లోరైడ్ పీడిత నల్లగొండకు నీళ్లు తీసుకొచ్చేందుకు ఉద్యోగాన్ని వదిలేసి పోరాటం చేసిండు ఈయన. ఈ మనిషి పేరు దుశర్ల సత్యనారాయణ. బ్యాంకు ఉద్యోగం చేస్తూనే నీటి కోసం పోరాటం చేసిండు. తుదకు నల్లగొండకు తాగునీరు, సాగునీరు కోసం తన ఉద్యోగాన్నే వదిలేసిండు. జలసాధన సమితి పెట్టి ఆందోళన చేసిండు.

నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యను, కాల్లు, చేతులు ఒంకరబోయి 30 ఏండ్లకే ముసలోల్లు అయితున్న వైనాన్ని దేశానికి, ప్రపంచానికి చాటేందుకు నల్లగొండ పార్లమెంటు స్థానానికి జరిగిన ఎన్నికల్లో 479 మంది చేత నామినేషన్ వేయించి సంచలనం సృష్టించిండు. ఒక ఎంపి స్థానానికి అంత భారీ సంఖ్యలో పోటీ చేసిన అభ్యర్థులు ఉండడం స్వతంత్ర భారత దేశంలో రికార్డుగా నిలిచింది. గెలుపు ఓటములు కాదు.. నల్లగొండ నీటి సమస్య దేశం ముందు ఉంచడం.. ప్రపంచం ముందు ఉంచడమే లక్ష్యంగా ఆయన ఈ సాహసం చేశారు. ఆ ఎన్నికల్లో నల్లగొండ ఎంపి స్థానానికి సిపిఐ నేత ధర్మ భిక్షం గెలుపొందారు. కానీ నల్లగొండ తాగు, సాగునీరు సమస్య దేశం దృష్టికి చేరిందంటే దుశ్చర్ల సత్యనారాయణే కారణం.

దుశర్ల చేసిన ఈ సాహసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవరపాటుకు గురిచేసింది. అప్పటివరకు నామినేషన్ ఫీజు నామమాత్రంగానే ఉండేది. దుశర్ల చేసిన ప్రయత్నంతో కేంద్ర ఎన్నికల సంఘం నామినేషన్ ఫీజు తక్కువగా ఉంటే చాలామంది నామినేషన్లు వేస్తున్నారన్న ఆందోళనతో అప్పటినుంచి ఫీజును భారీగా పెంచింది.

సొరంగం తొవ్వి పెట్టు.. నల్లగొండకు బువ్వ పెట్టు అన్న నినాదాలు దుశర్ల ఇచ్చినవే. ఆ నినాదాలు ఇప్పటికీ నల్లగొండ పల్లెటూర్లలో గోడల మీద సజీవంగా నిలిచాయి. జలసాధన సమితి పేరుతో నల్లగొండ జిల్లాలో శ్రీశైలం సొరంగం తొవ్వాలంటూ ఆందోళనలు చేసి అరెస్టులపాలై జైలుకు వెళ్లిన పరిస్థితి ఉంది.

తెలంగాణలో సాగు, తాగునీరు పేరుతో వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం పెట్టినా.. కేసిఆర్ ఇంకో పథకం పెట్టినా... ఫ్లోరైడ్ పీడిత నల్లగొండకు సాగునీరు ఇంకా రానేలేదు. వంకరకాళ్లు, 30 ఏళ్లకే ముసలి మొహాల బాధలు ఇంకా తీరలేదు.

తాజాగా తాను జలసాధన సమితి సభలు, సమావేశాలు ఎంత కష్టపడి నడిపారో వివరిస్తూ దుశర్ల సత్యనారాయణ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాన్ని ఏషియానెట్ మీకు అందిస్తుంది. చూడండి.

 

 

loader