నల్లగొండ జిల్లా పెదవూర మండలంలోని (Pedavura mandal) తుంగతుర్తి గ్రామ (Tungaturthy village) సమీపంలో శనివారం ఓ ట్రైనీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ మహిళా ట్రైనీ పైలట్ మృతిచెందారు.
నల్లగొండ జిల్లా పెదవూర మండలంలోని (Pedavura mandal) తుంగతుర్తి గ్రామ (Tungaturthy village) సమీపంలో శనివారం ఓ ట్రైనీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ మహిళా ట్రైనీ పైలట్ మృతిచెందారు. ఆమెను తమిళనాడుకు చెందిన మహిమగా గుర్తించారు. ఈ ఘటనపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. నల్గొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి కూడా ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. సింగిల్ సీటర్ చాపర్ ప్రమాదానికి గురైందన్నారు. ఈ చాపర్ నాగార్జున సాగర్‌లోని విజయపురి సౌత్‌లో ఉన్న ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందినదని తెలిపారు.
శిక్షణలో భాగంగా తమిళనాడుకు చెందిన ట్రైనీ పైలట్ మహిమ.. ఏవియేషన్ అకాడమీ నుంచి శనివారం ఉదయం 10:30 గంటలకు చాపర్‌లో టేకాఫ్ అయింది. ఉదయం 10:50 గంటలకు చాపర్ కుప్పకూలిపోయిందని తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, ఇతర అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారని తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై డీజీసీఏ, పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు.
చాపర్ కూలిన సమయంలో భారీ శబ్దం వినిపించిందని ఘటన స్థలానికి సమీపంలో పనిచేస్తున్న రైతులు, కూలీలు చెప్పారు. భారీ శబ్దంతో పాటుగా దట్టమైన మంటలు, పొగలు వచ్చినట్లు తెలిపారు. హెలికాప్టర్ కూలిన వెంటనే అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించామని తెలిపారు. నాగార్జున సాగర్ వైపు నుంచి హెలికాప్టర్ వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు. వెంటనే దీనిపై పోలీసులకు సమాచారం అందించామని తెలిపారు.
