చాక్లెట్ కవర్లలో కోట్ల విలువైన వజ్రాలు.. అవాక్కైనా అధికారులు..
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డైమండ్స్, విదేశీ కరెన్సీ పట్టుబడింది. వాటి విలువ తెలుసుకుని అధికారులే అవాక్కయ్యారు. ఇంతకీ ఎన్ని కోట్ల విలువైన వజ్రాలు పట్టుబడ్డాయో తెలుసా..?
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు ఎంత పకడ్బందీ చర్యలు తీసుకున్నా కేటుగాళ్ల ఆగడాలు ఆగడం లేదు. అక్రమంగా బంగారం, ఇతర విలువైన వస్తువులను తరలిస్తూ పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా కోట్ల విలువైన వజ్రాలు, విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఇద్దరు ప్రయాణికులు పట్టుబడ్డారు. వారి సామాన్లను క్షుణంగా పరిశీలించగా. రూ.6.03 కోట్ల విలువైన డైమండ్స్‌తో పాటు భారీగా విదేశీ కరెన్సీ, భారతీయ కరెన్సీ బయటపడింది. వారు దుబాయ్ వెళ్తున్నట్టుగా గుర్తించారు.ఈ క్రమంలోనే అధికారులు చాక్లెట్ ప్యాకెట్లలో సీలు చేసిన తెల్ల కాగితాలలో చుట్టబడిన జిప్డ్ ప్లాస్టిక్ పౌచ్‌లలో దాచిపెట్టిన విలువైన రాళ్లను కనుగొన్నారు.
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు హైదరాబాద్ విమానాశ్రయంలో 5569.64 క్యారెట్ల విలువైన రాళ్లు, ల్యాబ్‌లో వృద్ది చేసిన వజ్రాలు, రసాయన ఆవిరి నిక్షేపణ (సీవీడీ) వజ్రాలు, సహజ వజ్రాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ అధికారిక ప్రకటనలో తెలిపింది.
పట్టుబడిన వీటి విలువ సుమారు రూ.6.03 కోట్లు ఉంటుందని, అలాగే.. దుబాయ్‌కు వెళ్తున్న ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.9.83 లక్షల విలువైన విదేశీ కరెన్సీని, రూ.లక్ష విలువైన భారతీయ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నామని.. తదుపరి విచారణ కొనసాగుతోందని డీఆర్‌ఐ తెలిపింది.