రెండేళ్ల కిందట చికెన్, మందు పంపిణీ.. ఈ సారి టమాటాలు - మళ్లీ వార్తల్లో నిలిచిన బీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి
బీఆర్ఎస్ నేత నేత రాజనాల శ్రీహరి రెండేళ్ల కిందట ప్రజలకు మద్యం బాటిళ్లు, కోళ్లను పంపిణీ చేశారు. ఆ సమయంలో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఆయన టమాటాలను పంపిణీ చేశారు.

అది 2022 అక్టోబర్. అందరూ దసరా పండగను సంతోషంగా జరుపుకుంటున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. అందులో ఓ వ్యక్తి లైన్ లో నిలిబడిన అందరికీ మద్యం బాటిళ్లు, లైవ్ చికెన్ అందిస్తున్నారు. ఆయనెవరో కాదు బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్) నేత రాజనాల శ్రీహరి. ఈ వీడియోతో ఒక్కసారిగా ఆయన పేరు వార్తల్లో నిలిచింది. కట్ చేస్తే మళ్లీ ఇప్పుడు ఆయన వార్తల్లోకెక్కారు. ఇంతకీ ఇప్పుడేం చేశారంటారా ? అయితే ఇది చదవేయండి మరి..
మెంటల్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకొని ఇంటికొచ్చి.. తాత, అమ్మమ్మల దారుణ హత్య..
2022లో ప్రజలకు మద్యం, చికెన్ పంపిణీ చేసి మీడియా పతాక శీర్షికలకు ఎక్కిన భారత రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత రాజనాల శ్రీహరి.. తాజాగా టమాటాలు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ 47వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సోమవారం ఈ కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ రంగును సూచించేలా పింక్ ప్లాస్టిక్ బుట్టల్లో 2 కిలోల టమటాలను పెట్టి ఆయన పంపిణీ చేయగా.. వాటిని తీసుకునేందుకు మహిళలు, పురుషులు లైన్ లో నిలబడ్డారు. ఈ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అనంతరం రాజనాల శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు నేపథ్యంలో ఒక్కొక్కరికి 2 కిలోల చొప్పున 200 కిలోల టమాటాలను పంపిణీ చేశానని తెలిపారు. ప్రస్తుతం టమాటా ధరలు ఆకాశన్నంటాయని, దీంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు తాను ఈ విధంగా చేశానని చెప్పారు. ప్రజలు ఏ పరిస్థితుల్లోనూ ఇబ్బంది పడకూడదనే సీఎం కేసీఆర్, కేటీఆర్ సందేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. సాధ్యమైనప్పుడు ప్రజలకు సాయం చేయాలని మార్గనిర్దేశం చేశామన్నారు.
పరమేశ్వరుడిని వివాహమాడిన యువతి.. జీవితాన్ని శివుడికే అంకితమివ్వాలనే నిర్ణయం..
కాగా.. గత కొన్ని రోజుల నుంచి టమాటా ధరలు దిగిరావడం లేదు. ప్రస్తుతం మార్కెట్ లలో కిలో టమాటా రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, డిమాండ్ కు అనుగుణంగా పంట వేయకపోవడం, దూర ప్రాంతాల నుంచి సరఫరా లేకపోవడంతో మార్కెట్లో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. కొత్తగా వేసిన పంటలు చేతికొచ్చే వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.