దేశంలో ఏమి జరుగుతోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. అందుకనే నోట్ల రద్దు వ్యవహారం డ్రైవర్ లేని బండి లాగ తయారైంది.

పెద్ద నోట్ల రద్దు వ్యవహారం డ్రైవర్ లేని బండి వెడుతున్నట్లుగా ఉంది. చెలామణిలో ఉన్న వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేయట తన చేతిలో పని కాబట్టి ప్రధానమంత్రి మోడి ఒక్క ప్రకటనతో రద్దు చేసేసారు. అయితే, ఆ తర్వాత మొదలైన పరిణామాలు మాత్రం మోడి అదుపులో లేకుండా పోయాయి. నోట్ల రద్దు తర్వాత తలెత్తతబోయే పరిణామాలను బహుశా ప్రధాని కానీ లేక అధికార పార్టీ పెద్దలు గానీ, చివరకు రిజర్వ్ బ్యాంకు కూడా అంచనా వేయలేకపోయిందా అని అనుమానం వస్తోంది.

నోట్ల రద్దు విషయాన్ని ప్రధాని 8వ తేదీ రాత్రి ప్రకటించిన తర్వాత గురువారం వరకూ జరిగిన పరిణామాలేవీ కేంద్రప్రభుత్వ అదుపులో లేవు. దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్డెక్కారు. నోట్ల రద్దను ప్రధాని ప్రకటించే రోజుకు చెలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువ సుమారు 17.5 లక్షల కోట్లు. అందులో చిన్న నోట్ల విలువ కేవలం 50 వేల కోట్లేనని నిపుణులు అంటున్నారు. ఎప్పుడైతే ప్రభుత్వం 17 లక్షల కోట్ల విలువైన నోట్లను రద్దు చేసిందో దేశం మొత్తం మీద ఆర్ధిక ఎమర్జెన్సీ విధించినట్లైంది.

ఇక అప్పటి నుండి దేశప్రజలు మొత్తం రోడ్లపైనే ఉన్నారు. రోజు రోజుకు కరెన్సీ కష్టాలు పెరుగుతున్నాయో గానీ ఏమాత్రం తగ్గటం లేదు. దానికి తోడు రిజర్వ్ బ్యాంకు కూడా తన ఇష్టం వచ్చినట్లు నిబంధనలను మారుస్తుండటంతో ప్రజలు గందరగోళంలో పడుతున్నారు. నగదు మారకం నోట్ల విలువను ఒకసారి పెంచుతుంది, మరో రోజు తగ్గిస్తుంది. ఏటిఎంల నుండి డబ్బు తీసుకోవచ్చటుంది కానీ ఏ ఏటిఎం కూడా పనిచేయదు. ఒకసారి వారం రోజుల్లో సమస్యలన్నీ సర్దుకుంటుందని ప్రకటిస్తుంది. మరురోజే సమస్య మరో 50 రోజులు తప్పదని చెబుతుంది.

దేశంలోని నల్లధనాన్ని బయటకు తేవటానికే పెద్ద నోట్ల రద్దని ప్రధాని చెబుతున్నదానికి క్షేత్రస్ధాయిలో జరుగుతున్నదానికి అసలు సంబంధమే లేదు. దేశంలోని ప్రజలందరూ నోట్ల రద్దని స్వాగతిస్తున్నట్లు ప్రధాని ఒకవైపు చెబుతుండగానే మరోవైపు యావత్ దేశం రోడ్లపైకి వస్తున్న విషయాన్ని మీడియా చూపుతున్నది. నోట్లు రద్దయి ఇప్పటికి తొమ్మిది రోజులైనా కష్టాలు పెరుగుతున్నాయే గానీ తగ్గటం లేదు.

ప్రజల అవసరాలకు తీర్చటానికి సరిపడా నగదు నిల్వలున్నట్లు కేంద్రం ప్రకటించింది. వెంటనే నగదు ఎక్స్ చేంజి విలువను రూ. 4500 నుండి 2 వేలకు తగ్గిస్తు నిర్ణయం తీసుకున్నది. అంతకుముందు నుండే బ్యాంకులకు సరిపడా నగదు సరఫరా కావటం ఆగిపోయింది. దాంతో అసలు దేశంలో ఏమి జరుగుతోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. అందుకనే నోట్ల రద్దు వ్యవహారం డ్రైవర్ లేని బండి లాగ తయారైంది.