హైదరాబాద్ లో కస్టోడియల్ డెత్ : పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు మృతి.. గోప్యంగా ఉంచడంతో అనుమానాలు..

గచ్చిబౌలిలో ఓ కేసులో పోలీసుల అదుపులో ఉన్న ఓ నిందితుడు ఉన్నట్టుండి కుప్పకూలి మరణించాడు. అయితే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. 

Custodial death in Hyderabad : Death of accused in police custody - bsb

హైదరాబాద్ : హైదరాబాదులోని గచ్చిబౌలి పోలీసుల అదుపులో ఉన్న ఓ వ్యక్తి మృతి చెందాడు. ఓ కేసులో పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడు నితీష్ మరణించాడు. మృతుడు బీహార్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఓ కేసులో మృతుడు నితీష్ ఏ2గా ఉన్నాడు. సెక్షన్ 176 కింద కేసు నమోదు చేశారు. కాగా, పోలీసుల అదుపులో కస్టోడియల్ డెత్ కలకలం రేపింది. 

ఓ వ్యక్తి మీద దాడి చేసిన కేసులో నిందితుడిని పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చారు.  నిందితుడు  పోలీస్ స్టేషన్లోనే లోనే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కాగా, అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. మృతుడు బీహార్ రాష్ట్రానికి చెందిన నితీష్ కుమార్(32)గా సమాచారం.  

షాద్ నగర్ లో భారీ పేలుడు.. 11 మందికి తీవ్ర గాయాలు.. పలువురి పరిస్థితి విషమం..

నితీష్ పనికోసం కొంతకాలం క్రితం బీహార్ నుంచి హైదరాబాదులోని గచ్చిబౌలి ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడ ఓ ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీలో పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా నానక్ రామ్ గూడాలోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన లేబర్ క్యాంప్ లో సెక్యూరిటీ గార్డ్ గా ఉన్నాడు. ఆ లేబర్ క్యాంపు నిబంధనల ప్రకారం రాత్రి 11:30 తర్వాత కూలీలను బయటికి పంపకూడదు. 

అయితే శనివారం రాత్రి కొందరు కూలీలు బయటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని నితీష్ కుమార్, అతనితో పాటు పనిచేస్తున్న మరి కొంతమంది గార్డులు ఆపారు. దీంతో మమ్మల్ని ఆపుతావా అంటూ.. కూలీలు ఎదురు తిరగడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ కూలీల మీద నితీష్ కుమార్ తో పాటు.. వికాస్, బిట్టు అనే వ్యక్తులు రెచ్చిపోయారు.

ఇనుపరాడ్ తో వారి మీద దాడి చేశారు. ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.  ఈ సమాచారం పోలీసులకు అందడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గొడవ విషయం తెలుసుకుని… గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అర్ధరాత్రి 12:30 సమయంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి…  కూలీలపై దాడి చేసిన నితీష్ కుమార్, బిట్టు, వికాస్ లను తీసుకువచ్చారు.

వీరిమీద 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురిని లాకప్ లో ఉంచారు.  కాగా, ఆదివారం ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో నితీష్ కుమార్ లాకప్ లోనే ఒకసారిగా స్పృహ తప్పి  పడిపోయాడు. పోలీసులు వెంటనే అతనికి సిపిఆర్ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అక్కడ నితీష్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అయితే, నిందితుడు మరణించిన విషయాన్ని పోలీసులు రాత్రి వరకు ఎవరికీ చెప్పలేదు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఈ విషయం వెలుగు చూడడంతో మాదాపూర్ డిసిపి శిల్పవల్లి వివరణ ఇస్తూ.. నితీష్ కుమార్ గుండెపోటుతోనే చనిపోయాడని చెప్పారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios