Telangana: ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా క్రిప్టో కరెన్సీ పట్ల యువత ఆకర్షితులవుతుండటాన్ని సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటూ.. ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే వరంగల్ లోని నర్సంపేట పరిధిలో చోటుచేసుకుంది. ఏకంగా 40 మందికి పైగా యువకులు రూ.లక్షల్లో పొగొట్టుకున్నారు. ఈ పిరమిడ్ స్కీమ్ మోసానికి గురైన బాధితుల సంఖ్య పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు.
Telangana: దేశంలో గత కొంత కాలంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆన్‌లైన్ పెట్టుబడులతో తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బును సంపాదించవచ్చనే మాయలోకి యువకులను దించుతూ.. సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా క్రిప్టో కరెన్సీ (cryptocurrency) వైపు యువతను మళ్లించి.. ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తెంగాలణలోని వరంగల్ జిల్లాలలో క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో ఏకంగా 40 మంది యువకులను సైబర్ నేరగాళ్లు మోసగించారు. లక్షల్లో వారి నుంచి నగదును కొల్లగొట్టారు. బాధితులు మోసపోయామని తెలుసుకునీ, పోలీసులను ఆశ్రయించడంలో ఈ క్రిప్టో కరెన్సీ పెట్టుబడి ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది. బాధితుల సంఖ్య వందల్లో ఉండే అవకాశముందని తెలిపారు.
క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్ గురించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పేరుతో దాదాపు 40 మంది యువకులను మోసం చేస్తూ.. వారి నుంచి లక్షల రూపాయలను కొల్లగొట్టిన క్రిప్టో కరెన్సీ సైబర్ ఫ్రాడ్ వరంగల్ జిల్లాలోని నర్సంపేట పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. లక్నేపల్లికి చెందిన కత్తి రాజు అనే బాధితుడు బుధవారం పోలీసులను ఆశ్రయించాడు. జనగాం జిల్లా పామునూరు గ్రామానికి చెందిన పల్లాటి నవీన్ అనే వ్యక్తి తనకు క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల గురించి ఎరజూపి.. అందులో పెట్టుబడులు పెడితే అధిక డబ్బు వస్తుందనీ, నెలనెలకు మంచి ఆదాయం పొందవచ్చని మాయమాటలు చెప్పి.. రూ.1.70 లక్షలు పెట్టుబడి పెట్టేవిధంగా చేశాడు. చాలా సంవత్సరాల పాటు వారం వారం రూ. 13,500 వస్తాయని కూడా చెప్పాడు.
“కానీ బాధితుడికి కేవలం మూడు నెలలు మాత్రమే చెల్లించారు. తర్వాత డబ్బులు కావాలని ఆ వ్యక్తికి ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో మోసపోయానని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. నిందితులు నవీన్ అత్తమామలు వరంగల్-నర్సంపేట హైవేపై నర్సంపేట పట్టణానికి ఆనుకుని ఉన్న లక్నెపల్లి గ్రామానికి చెందినవారు కావడంతో చాలా మంది.. వారిపై నమ్మకం ఉంచి ఈ పిరమిడ్ స్కీమ్ అని తెలియకుండానే అందులో పెట్టుబడులు పెట్టి.. ఈ ఆన్‌లైన్ మోసానికి బలైపోయారు. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులకు సంబంధించిన స్పష్టమైన కేసు అని మేము చెప్పలేము. ఇది పిరమిడ్ నిర్మాణంపై ఆధారపడిన పథకం (పిరమిడ్ స్కీమ్). ఇక్కడ పెట్టుబడిదారుడు తన కింద ఉన్న వ్యక్తులు కొత్త సభ్యులను చేర్చుకుంటే కమీషన్ పొందుతాడు” అని సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు నర్సంపేట పోలీసులు కేసు నమోదు చేసి హన్మకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లోని సైబర్ క్రైమ్ విభాగానికి అప్పగించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ కేసులో దాదాపు 40 మంది బాధితులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే క్రిప్టోకరెన్సీలోకి పెట్టుబడుల పేరుతో దాదాపు 400 మంది ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బాధితులు బుధవారం సాయంత్రం పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. అలాగే, మమ్నూర్ ఏసీపీ సర్కిల్ పరిధిలో కూడా ఆన్‌లైన్ మోసానికి సంబంధించిన కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. రెండు కేసులు విచారణలో ఉన్నాయని, ఈ కేసుల్లో బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.
